ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..
బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్‌బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్‌లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది.
బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్‌కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు.
ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్‌పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..)


