ధనం వద్దు.. ఆహారం ఇద్దాం! | beggars qr code and street artist swathi special story | Sakshi
Sakshi News home page

Child Begging ధనం వద్దు ఆహారం ఇద్దాం

Aug 13 2025 10:15 AM | Updated on Aug 13 2025 10:36 AM

beggars qr code and street artist swathi special story

 బెగ్గింగ్‌  మాఫియా

దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు. చిన్నపిల్లలను ఎండలో మాడ్చి, వానలో తడిపి చేయించే భిక్షాటనలో దానం చేస్తే వచ్చేది పాపమా పుణ్యమా?చంటిపిల్లలతో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర చేయించేది భిక్షాటన కాదు బెగ్గింగ్‌మాఫియా అంటారు స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌ స్వాతి.సంవత్సర రోజులుగా ‘చైల్డ్‌ బెగ్గింగ్‌’ నిరోధానికి ఆమె తన భర్త విజయ్‌తో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోమ్యూరల్స్‌ ద్వారా, పోస్టర్స్‌ ద్వారా చైతన్యం తెస్తున్నారు.హైదరాబాద్‌లో జరిగిన ‘ఆగస్ట్‌ ఫెస్ట్‌’లోవీరి పోస్టర్‌ ప్రదర్శన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ను ఆకట్టుకుంది. డబ్బు దానానికి బదులు ఆహారం ఇవ్వడమే ఈ మాఫియాకు విరుగుడు అంటున్న స్వాతితో సంభాషణ... 

‘మేము ఒక అబ్జర్వేషన్‌ చేశాం. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ, విప్రో సర్కిల్‌ దగ్గర ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే ఒక బిచ్చగాడు చిల్లర లేదంటే క్యూఆర్‌ కోడ్‌ చూపించాడు. అక్కర కొద్దీ అడుక్కునేవారు క్యూఆర్‌ కోడ్‌ వాడరు. దీనినో బిజినెస్‌గా మార్చినవారే వాడతారు. భిక్షాటన చుట్టూ ఎన్నో విషయాలు ఉన్నాయి. కాని వాటిలో పసిపిల్లల్ని బాధ్యులను చేయడం పట్లే మా అభ్యంతరం. 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో, విద్యా హక్కుతో ఉండాలి. అలా లేక΄ోతే వారి గురించి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉంది. ఈ దేశ ΄పౌరులుగా మేము ప్రశ్నిస్తున్నాం’ అంటారు స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌ స్వాతి.

"> ఖమ్మంకు చెందిన స్వాతి స్ట్రీట్‌ ఆర్ట్, మ్యూరల్స్‌లో పారిస్‌లో శిక్షణ పొందారు. భర్త విజయ్‌తో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నో వాల్‌ మ్యూరల్స్‌ వేశారు. ఆడపిల్లల విద్య కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు ‘ఐయామ్‌ నాట్‌ యాన్‌ ఆబ్జెక్ట్‌ ఫర్‌ బెగ్గింగ్‌’ (భిక్షాటనకు నేనొక వాహకాన్ని కాదు) పేరుతో పసిపిల్లలతో చేసే భిక్షాటనను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం కోసం సంవత్సరం రోజులుగా స్ట్రీట్‌ ఆర్ట్‌తో, ΄ోస్టర్స్‌తో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో వాల్‌ మ్యూరల్స్‌ వేశారు. v 

వాళ్లు ఎందుకు నిద్ర పోతుంటారు?
‘పిల్లల్ని మనం ఎంతో శ్రద్ధతో సంరక్షణ చేస్తాం. వారికి మంచి ఆహారం, నీరు అందేలా చూస్తాం. కాని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర పిల్లలు ఎంత ప్రమాదకరంగా ఉంటారో మనం చూసి కూడా స్పందించం. వాహనాల మధ్య పిల్లలు తిరుగుతుంటారు... కొందరు స్త్రీలు నెలల బిడ్డలను చంకన వేసుకుని వారిని చూపించి బిచ్చం అడుగుతుంటారు. కాని గమనించి చూస్తే వీరిలో చాలామంది ఎండైనా, వానైనా నిద్ర పోతుంటారు. వారెందుకు నిద్ర పోతుంటారు? వారికి కెమికెల్స్‌ ఏవో ఇస్తారు నిద్ర పోవడానికి. వైటనర్స్‌ వాడతారు. డ్రగ్స్‌ ఇస్తారు. ఇలాంటి పిల్లలు పెద్దయ్యి తిరిగి డ్రగ్స్‌ అమ్మే స్థితికి చేరుతారు. దేశంలో మిస్సవుతున్న పిల్లలు భిక్షాటనకు  పావులుగా మారుతున్నారు. ఆంధ్రా పిల్లల్ని మరో రాష్ట్రంలో, మరో రాష్ట్రంలోని వారిని తెలంగాణలో ఇలా గ్రూపులుగా చేసి వ్యవస్థీకృతంగా భిక్షాటన చేయిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో ఎందుకు కనుక్కోరు? ప్రభుత్వాలు,  పౌరులు ఎందుకు పట్టించుకోరు? ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఎండలో చంటి పిల్లలు మాడుతుంటే మనం 100కు డయల్‌ చేస్తే అలా నలుగురు ఫోన్‌ చేసినా  పోలీసులు పట్టుకెళతారు. ఆ పనీ చేయం. వేల మంది పిల్లలు మన దేశంలో ఇలా ఎంతకాలం బిచ్చమెత్తుకోవాలి. అందుకే మా వంతు బాధ్యతగా ఈ క్యాంపెయిన్‌ చేస్తున్నాం. ఆగస్టు 9 హైదరాబాద్‌లో జరిగిన ఆగస్ట్‌ ఫెస్ట్‌లో క్రియేటివ్‌ ఫోరమ్‌ కింద మా పోస్టర్స్‌ ప్రదర్శన చేశాం. మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు స్వాతి.

 

 

రోజుకు 60 వేలు
‘హైదరాబాద్‌లో ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఒక గ్రూప్‌ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు భిక్షాటన చేస్తే ఎంత సంపాదిస్తారో తెలుసా? 60 వేలు. అవును... ఒకసారి సిగ్నల్‌ పడితే 300 వాహనాలు ఆగుతాయి. అలా పీక్‌ అవర్స్‌లో రోజుకు 250 సార్లు సిగ్నల్స్‌ పడతాయి. ఒక రోజులో ఒక సిగ్నల్‌ పాయింట్‌ నుంచి 60 వేల వాహనాలు వెళతాయి. రూపాయి రెండ్రూపాయలు ఇప్పుడు ఎవరి దగ్గరాలేవు. పది రూపాయల లెక్కన వీరిలో పది శాతం మంది దానం చేసినా రోజులో 60 వేల రూపాయలు వస్తాయి. ఇలా సిటీలోని అన్ని సిగ్నల్‌ పాయింట్స్‌ దగ్గరి నుంచి ఎంత వసూలవుతుందో... ఇది ఎంత పెద్ద వ్యాపారమో ఊహించుకుంటే భయం వేస్తుంది. ఇంత పెద్ద వ్యాపారాన్ని చేయించడానికి పసిపిల్లల కోసం ఎన్నెన్ని దారుణాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ మాఫియాను ఆపాలి’ అంటారు స్వాతి.

డబ్బును దానం చేయవద్దు
‘నిజంగా దానం చేయాలంటే ఆహారాన్ని దానం చేయాలి. అదే కదా అవసరం. డబ్బు దానం చేస్తే డబ్బుతో ఏదైనా చేయొచ్చు. మత్తు పదార్థాలు, మద్యం కొనొచ్చు. డబ్బు కోసం దారుణాలు చేయొచ్చు. ఆహారాన్ని డబ్బుగా మార్చలేరు. అందుకే దానం చేస్తే ఆహారం ఇవ్వాలి. అలాగే చంటి పిల్లలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర కనపడితే పోలీసులకు చెప్పాలి. ఇంత వరకూ సిటీలో కనిపించే గ్యాంగులు ఇప్పుడు టౌన్ల వరకూ వెళ్లాయి. ఇంకా ఎంత దూరం వెళతాయో చెప్పలేము. కాబట్టి పిల్లల్ని కాపడటానికి పౌరులుగా మనమంతా ముందుకు రావాలి. మేము మా సొంత నిధులతో చేయదగ్గది చేస్తున్నాం. సపోర్ట్‌ చేస్తామని వాళ్లు వీళ్లు అడుగుతున్నారు. దాని కంటే కూడా ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లగలగడమే మాకు ఇవ్వగల సపోర్ట్‌’ అని తెలిపారు స్వాతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement