
‘ఫ్యాషన్ అంటే హంగులు కాదు, ఫ్యాషన్ అంటే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ ఎంతోమంది మనసులు దోచుకున్న అమ్మాయి నటి కళ్యాణి ప్రియదర్శిని. ఆమె శైలి, సౌందర్య రహస్యాలే ఇప్పుడు మీ ముందుంది.
నటి కళ్యాణి ప్రియదర్శిని ధరించిన డ్రెస్ బ్రాండ్: పింక్‌సిటీ బై సారిక ధర: రూ. 38,500 కాగా, జ్యూలరీ బ్రాండ్: కళ్యాణ్ జ్యూవెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేనె, నెయ్యి కలిపిన ప్యాక్, పసుపు ఫేస్ మాస్క్, తగినంత నిద్ర, జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్ – అంతే! ఇవే నా బ్యూటీ సీక్రెట్.
అయితే, ప్రతి అమ్మాయిలోనూ ఒక అందం ఉంటుంది. అది వెలుగులోకి రావాలంటే, సరైన శ్రద్ధ అవసరం. అప్పుడు మీరు సహజంగా మెరుస్తారు. ఇలా సహజమైన చిట్కాలను పాటిస్తూనే అందాన్ని వెలికితీయొచ్చు అని చెబుతోంది కళ్యాణి ప్రియదర్శిని
నెత్తికెక్కిన అందం
మెడలో కాదు, చెవుల్లో కాదు, ఈ ఆభరణం దక్కించుకున్న స్థానం తలమీదే! అన్నింటి కంటే పైస్థాయి అంటే ఇదే. నెత్తిమీదకు ఎక్కిందంటే అది అహంకారం వల్ల కాదు, ఆత్మవిశ్వాసంతో. చూశారంటే సింపుల్‌గా ఉంటుంది, ‘ఇది ఎలాంటి జ్యూలరీ?’ అనిపిస్తుంది. కాని, వేసుకుంటే చూసే వారి చూపులను ఆకట్టుకోగల సత్తా ఉంది ఈ అభరణానికి. ఈ మినిమలిస్ట్ హెడ్ బ్యాండ్ ఒకవైపు ఆధునికత, మరోవైపు సంప్రదాయాల కలబోత.
ఇప్పటి ఫ్యాషన్ భాషలో దీన్ని ‘హెడ్ బ్యాండ్ జ్యూలరీ’ అంటారు. కాని, మన పూర్వీకులు దీనిని ‘తలమిన్న’, ‘శిరోభూషణం’ అని పిలిచేవారు. పేర్లు పాతవైనా స్టయిల్ మాత్రం పక్కా ట్రెండీ! ఇది తలపై ధరించిన వెంటనే మీ లుక్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
మామూలు చీర, కుర్తా, లెహంగా ఏదైనా సరే దీన్ని జత చేస్తే మీరు కేవలం రెడీ అవ్వరు రాయల్‌గా రెడీ అయిపోతారు. మేకప్ లేకపోయినా, ఈ తలమిన్న ఒక్కటే ముఖాన్ని గ్లో మోడ్‌లోకి మార్చేస్తుంది. లైట్ మేకప్, వదిలేసిన జుట్టు దీని స్టయిలింగ్‌కు బెస్ట్ కాంబో. ఇంత తక్కువ బరువుతో, ఇంత ఎక్కువ ఫ్యాషన్ ఎఫెక్ట్ ఇచ్చే జ్యూలరీ ఇంకా ఏదీ దొరకదు!