Baljit Kaur: 'బల్జిత్‌ కౌర్‌ అనే నేను'.. పంజాబ్‌లో ఏకైక మహిళా మంత్రి

Baljit KaurOnly Lady Minister In AAP New Government In Punjab - Sakshi

పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ‘ఆప్‌’ సర్కార్‌ మంత్రివర్గంలోని ఏకైక మహిళ బల్జిత్‌కౌర్‌. మలౌత్‌ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారిగా శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. బల్జిత్‌ తండ్రి సాధుసింగ్‌ ఫరిద్‌కోట్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేసినప్పటికీ, ఆమె ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు.  అభ్యర్థుల ఎంపిక కోసం చేసిన విశ్లేషణలలో పార్టీ పెద్దలకు చాలామంది బల్జిత్‌ పేరు సూచించారు. అలా పార్టీ టికెట్‌ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దీంతో తాను చేస్తున్న డాక్టర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 

‘మంచి పనిచేశావు. తప్పకుండా గెలుస్తావు’ అని ప్రోత్సాహం ఇచ్చిన వారికంటే– 
 ‘తొందరపడుతున్నావు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు మన చేతుల్లో ఉండవు’ అని వెనక్కిలాగిన వారే ఎక్కువ. 
‘రెండు సార్లు వరుసగా గెలిచిన హర్‌ప్రీత్‌ సింగ్‌పై గెలవడం ఆషామాషీ ఏమీ కాదు’ అనేవారు సరేసరి. 
అయితే బల్జిత్‌కౌర్‌ అవేమీ పట్టించుకోలేదు. ‘ఒక్కసారి బరిలో దిగానంటే వెనక్కి చూసేది లేదు’ అనుకునే మనస్తత్వం కౌర్‌ది. 
ఆమె ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, పార్టీ అభిమానులతో పాటు ఏ పార్టీ వారో తెలియని పేషెంట్లు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. అంత బిజీషెడ్యూల్‌లోనూ వారితో ఓపికగా మాట్లాడేవారు కౌర్‌. 

ఎన్నికల సభలలో ఒకవైపు నేతలు ప్రసంగాలు సాగుతుండేవి. మరోవైపు బల్జిత్‌ పేషెంట్లతో మాట్లాడుతూ మందుల చిట్టీలు రాస్తున్న దృశ్యం సర్వసాధారణంగా కనిపించేది. 
కౌర్‌ ఎన్నికల ఉపన్యాసాల్లో స్త్రీసాధికారికతకు సంబంధించిన అంశాలు ఎక్కువగా వినిపించేవి. 

‘రోగాలతోపాటు అవినీతిని రూపుమాపే డాక్టర్‌ వస్తున్నారు’ అనే నినాదం ఆకట్టుకుంది. 
ముక్త్‌సర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బల్జిత్‌కౌర్‌ వైద్యురాలిగా పనిచేసిన సమయంలో ఆమెను ‘డాక్టర్‌ జీ’ లేదా ‘మేడమ్‌’ అని పిలిచే వారికంటే ‘అక్కా’ ‘అమ్మా’ అని ఆత్మీయంగా పిలిచేవారే ఎక్కువ. ఎందుకంటే బల్జిత్‌ తన బాధ్యత ‘కేవలం వైద్యచికిత్స మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు. 
పేషెంట్లను ఆప్యాయంగా పలకరించేవారు. 
ఎవరికైనా డబ్బు అవసరం పడితే ఇచ్చేవారు. 
కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేవారు. 

ముక్త్‌సర్‌ చుట్టుపక్కల అట్టారి, బుడిమల్, లంబీదాబీ....మొదలైన గ్రామాల నుంచి ఆస్పత్రికి పేషెంట్లు  వచ్చేవారు. వారందరికీ బల్జిత్‌ పెద్దదిక్కు. ఒక ధైర్యం. 
అందుకే ఆమె శాసనసభ్యురాలిగా గెలిచినప్పుడు, ఆ గెలుపు అనేక గ్రామాల సంతోçషం అయింది. 
బల్జిత్‌కౌర్‌లో రచయిత్రి, కవయిత్రి కూడా ఉన్నారు. 
ఎండలో మెరిసే కొండల అందాన్ని, చెట్ల సోయగాన్ని, పిట్టల పాటల పరవశాన్ని కవితలుగా రాయడమే కాదు రకరకాల సామాజిక సమస్యలపై పత్రికలకు వ్యాసాలు రాయడం కూడా ఆమె అభిరుచి. 
‘నాకు అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఒక మహిళగా, వైద్యురాలిగా స్త్రీ సంక్షేమం, మెరుగైన ఆరోగ్యవ్యవస్థ గురించి పనిచేస్తాను’ అంటున్నారు బల్జిత్‌కౌర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top