
ఆరోగ్యం, ఆచారం, ఆనందం,
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే తద్దెనోము నోచని పల్లెపడచులు తెలుగు నాట ఉండరంటే అతిశయోక్తి కాదు. పల్లెటూళ్లలో అయితే యువతీ యువకులందరూ అట్లతద్దె ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూచుంటారు. ఇంతకీ ఈ అట్ల తద్దెనోము ముందుగా ఎవరు నోచారో, వారికి కలిగిన ఫలమేమిటో తెలుసుకుంటూ, ఆ నోము నోచే విధానం కూడా చెప్పుకుందాం. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగువారికి అట్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. సాయంత్రం వాయనాలు, నైవేద్యాలు పూర్తిచేసుకుని గోమాతను పూజిస్తారు. అక్కడ నుంచి దీపాలను వదలడానికి చెరువులు, కాలువల దగ్గరకు వెడతారు. అన్నీ పూర్తయిన తరవాత చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు.
ఈ నోము ఇందుకోసం
ఆశ్వయుజ బహుళ తదియనాడు చేసుకునే ఈ పూజ ప్రధానంగా చంద్రుని ఆరాధనకు సంబంధించినది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వలన కలిగే దోషాలు పరిహారమై, సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది ఒక విశ్వాసం. అంతేకాక కుజుడు రజోదయానికి కూడా కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవడం కోసం, గర్భస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ముత్తయిదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలో ఇంతటి వైద్యవిజ్ఞానం ఉంది. ఈ పండుగను ఉత్తరభారతదేశంలో కరవాచౌత్ అనే పేరుతో జరుపుకుంటారు.
వ్రతవిధానం: ఈ రోజు తెల్లవారుఝామునే స్త్రీలు మేల్కొని స్నానం చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో తూర్పుదిక్కున గౌరీదేవికి మంటపం ఏర్పాటు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి ముందుగా గణపతిపూజ చేయాలి. పిదప శాస్త్రోక్తంగా గౌరీదేవికి పూజచేసి, ఆ తరవాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదవడంతో పాటు, పాటలు పాడాలి. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరవాత శుచిగా స్నానం చేసి మళ్లీ గౌరీపూజ చేయాలి. 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. పేరంటానికి వచ్చిన ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికలగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి, తామూ భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇందులో విశేషం. (ఈ సంఖ్య ఇంటిని బట్టి, ప్రాంతాలను బట్టి మారచ్చు).

ఇవన్నీ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, కన్యలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని నమ్మకం.
అట్లతద్దెలో ఆరోగ్యం
ఇది కన్నెపిల్లలంతా ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. తెల్లవారు ఝామునే లేవటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పేరంటం చేస్తూ అందరితో సరదాగా ఉండటం పిల్లలకు అలవాటవుతాయి.చలికాలం దగ్గర పడే సమయం కావడంతో పొద్దున్నే లేవలేకపోతారు. ఈ పండగ కారణంగా ఉత్సాహం కొద్దీ ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటారు. అలాగే చలి నుంచి శరీరానికి వేడి పుట్టే ఆహారం కూడా ఆ రోజున తీసుకోవడం వల్ల ఆరోగ్యపుష్టికి దోహదపడుతుంది. నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, పెరుగు వంటివి శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయపులుసు చలవ చేస్తుంది. అంతేకాక అన్నీ చద్దివి తినడం వల్ల అరగదనే భయం కూడా లేకుండా తాంబూల సేవనం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆనంద, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. ఆట΄ాటల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం కూడా అవుతుంది.
గౌరీదేవి శివుని పతిగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. (నేడు అట్ల తద్ది)
చదవండి:చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
ఇదీ చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?