Assam Floods 2022: స్త్రీ శక్తి: సలాం... రైఫిల్‌ ఉమెన్‌

Assam Rifles conducts rescue operations in Assam Floods - Sakshi

అస్సాంలోని కొన్ని జిల్లాలు వరదల బారిన పడి చిగురుటాకులా వణికిపోయాయి. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ అన్నట్లుగా ఉంది మృత్యువు రాకడ. అలాంటి సమయంలో ‘రైఫిల్‌ ఉమెన్‌’ రంగంలోకి దిగింది. ఎంతోమందిని రక్షించింది...

చిరునవ్వుతో పలకరించిన నేస్తంలా మురిపించిన చినుకులు, సమయం గడిచేకొద్దీ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కుండపోత వర్షం. కపిలి, బేకి, బరక్, ఖుషి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి.
అస్సాంలో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచర్‌ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలమైంది.

ఆ కల్లోలంలో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు’ అనే బతుకు ఆశ తప్ప‘మన గురించి కాదు ఇతరుల గురించి ఆలోచించాలి’ అనే ఆలోచన రాని సమయం అది. అలాంటి కఠిన సమయంలో ‘మేము ఉన్నాం’ అంటూ ముందుకు వచ్చారు వారు.
వాగు దాటి అవతలి ప్రాంతానికి వెళదామని ప్రయత్నించి ఒకాయన వరదల్లో పడి కొట్టుకుపోతున్నాడు. ఎక్కడో ఒకచోట విరిగిపడిన కొమ్మలు, చెట్ల మధ్య ఇరుక్కుపోయాడు. వరద ఎక్కువైతే, ఆలస్యం అయితే అతని చిరునామా కూడా తెలిసేది కాదు. విషయం తెలిసిన మహిళల బృందం రంగంలోకి దిగింది. అతడిని రక్షించింది.

ఒక వృద్ధురాలిని వరద చుట్టుముట్టింది. దాని నుంచి బయటపడే శక్తి ఆమెకు లేదు. ఆ వృద్ధురాలిని పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈలోపు అక్కడికి పరుగెత్తుకు వచ్చిన ఒక యువతి ఆ వృద్ధురాలిని రెండు చేతులతో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి చేర్చింది.
కొన్ని ఇండ్లను పూర్తిగా వరద నీళ్లు చుట్టుముట్టాయి. బయటికి రాలేని పరిస్థితి. అలా అని ఇంట్లో ఉండలేని పరిస్థితి. అవి పాత ఇండ్లు. వర్షంతో గోడలు నానిపోయి ఉన్నాయి. ఏ నిమిషంలో ఇండ్లు కూలిపోతాయో తెలియదు.

అలాంటి ఇండ్లలో నుంచి వృద్ధులు మొదలు పసిపిల్లల వరకు బయటికి తీసుకువచ్చి వారి ప్రాణాలు రక్షించారు వారు.
‘రెండు చేతులెత్తి మొక్కడం తప్ప వారి రుణం ఎలా తీర్చుకోగలం’ అని కళ్లనీళ్లపర్యంతం అయింది ఒక గృహిణి.
ఇంతకీ వారు ఎవరు?

‘రైఫిల్‌ ఉమెన్‌’ బృందాలు.
‘రైఫిల్‌ ఉమెన్‌’ బృందాలకు అస్సాంలో మంచిపేరు ఉంది. అస్సాం రైఫిల్స్‌లో భాగమైన రైఫిల్‌ ఉమెన్‌ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు, సహాయ కార్యక్రమాలు చేయడంలో పేరు తెచ్చుకున్నాయి.
‘ఆ వృద్ధురాలిని రక్షించిన తరువాత ఆమె కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడూ మరచిపోలేను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించింది. రైఫిల్‌ ఉమెన్‌ బృందంలో పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను’ అంటుంది 22 సంవత్సరాల మంతిదాస్‌.
అస్సాంలోని దుర్బీ ప్రాంతానికి చెందిన మంతిదాస్‌ సైన్యంలో చేరడం వారి ఇంట్లో వాళ్లకు బొత్తిగా ఇష్టం లేదు.

‘శిక్షణ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. రోజూ ఉదయం 22 కేజీల బరువు పట్టుకుని 25 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి వచ్చేది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండేవి. ఒకానొక సమయంలో అయితే ఇక నావల్ల కాదేమో అనుకున్నాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఆ శిక్షణలోని గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. ఆ శిక్షణ వల్లే సహాయకార్యక్రమాల్లో చురుగ్గా, ధైర్యంగా పాల్గోగలిగాను’ అంటుంది మంతిదాస్‌.

‘తమ పిల్లలను సైన్యంలోకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతుంటారు. మా తల్లిదండ్రులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సహాయకార్యక్రమాల్లో మేము పాల్గొన్న ఫోటోలను పేపర్లో చూసి మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు’ అంటుంది యతిర్‌.
మంతిదాస్, యతిర్‌లు మాత్రమే కాదు ‘రైఫిల్‌ వుమెన్‌’ బృందాలలోని ఎంతోమంది మహిళా సైనికులు అసాధారణమైన సాహసాలు ప్రదర్శించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. జనం చేత నీరాజనాలు అందుకున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top