Asha Sahay: 17 ఏళ్ల వయసులో దేశం కోసం! జపాన్‌లో పుట్టి.. నేతాజీ ఆర్మీలో

Asha Sahay: Japan Born Woman Join Netaji Indian National Army Book - Sakshi

ది వార్‌ డైరీ – ఒక రణధీర కథ

కొందరు అందరిలా ఉండరు.... ‘ఎందుకీ పక్షులు కొమ్మల్ని విడిచి పారిపోతున్నాయి ఆకాశాల బరువుల్ని మోసుకుంటూ? ఎందుకీ చెట్లు ఇలా వలస పోతున్నాయి పువ్వుల భారాన్ని మోసుకుంటూ? ఎవరైనా వాటి నేత్రాల్లో ఉన్న శోకసముద్రాలు గుర్తించారా? దేశపు గొంతులో ఉన్న ఆక్రోశం ఎవరైనా విన్నారా?’ అంటూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాంటి వారిలో ఒకరు ఆశా సహాయ్‌. పదిహేడు సంవత్సరాల వయసులో దేశం కోసం యుద్ధక్షేత్రాల్లోకి వెళ్లింది...

జపాన్‌లోని కోబ్‌ నగరంలో జన్మించింది ఆశా సహాయ్‌. తండ్రి ఆనంద్‌ మోహన్‌ సహాయ్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు రాజకీయ సలహాదారు. అంతకుముందు బాబూ రాజేంద్రప్రసాద్‌కు సెక్రెటరీగా పనిచేశాడు. బిహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన ఆనంద్‌ మోహన్‌ ఆనాటి నిర్బంధ పరిస్థితుల్లో జపాన్‌కు వెళ్లాడు. అక్కడ బతుకుదెరువు కోసం జపాన్‌ పిల్లలకు ఇంగ్లీష్‌ బోధించేవాడు.

‘దేశానికి దూరంగా ఉన్నా, మా నుంచి దేశం ఎప్పుడూ దూరంగా లేను. నా దేశానికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు రావాలని ఆబాలగోపాలం కోరుకునే రోజులవి’ అంటున్న ఆశా సహాయ్‌ తల్లిదండ్రుల ద్వారా మాటలు, పాటల రూపంలో దేశభక్తిని ఆవాహన చేసుకుంది.

పదిహేడు సంవత్సరాల వయసులో నేతాజీ భారత జాతీయ సైన్యంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరింది. జపాన్‌ నుంచి తైవాన్‌ అక్కడి నుంచి థాయిలాండ్‌ వరకు ప్రయాణించి రాణి ఝాన్సీ రెజిమెంట్‌లోకి వెళ్లింది. రైఫిల్‌ హ్యాండ్లింగ్‌ నుంచి యాంటీ–ఎయిర్‌ క్రాఫ్ట్‌గన్స్‌ వరకు తొమ్మిది నెలల పాటు రకరకాల విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకుంది.

గెరిల్లా యుద్ధతంత్రాలలో ఆరితేరింది. సింగపూర్, మలేసియా, బర్మా... యుద్ధకేత్రాల్లో పని చేసింది. తాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని ప్రతికూల పరిస్థితుల్లో  ఎన్నో రోజులు బర్మా అడవుల్లో గడిపింది. తన పోరాట అనుభవాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేది.

ఆశా సహాయ్‌ని సైనిక దుస్తుల్లో చూసిన రోజు తల్లి సతీ సహాయ్‌... ‘నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు నువ్వు మా బిడ్డవి కాదు, భరతమాత బిడ్డవు’ అని ఆశీర్వదించింది. 

బెంగాల్‌కు చెందిన సతీ సహాయ్‌ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తరంజన్‌దాస్‌కు సమీప బంధువు. ‘బాంబుగాయాలతో బాధ పడుతున్నా సరే వెనకడుగు వేసేవాళ్లం కాదు’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది ఆశా సహాయ్‌.

తాను డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌ కోలిన్స్‌ తాజాగా ‘ది వార్‌ డైరీ ఆఫ్‌ ఆశా–సాన్‌: ఫ్రమ్‌ టోక్యో టు నేతాజీస్‌ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో ప్రచురించడం ఇదే తొలిసారి. ఆశా మునిమనవరాలు తన్వీ శ్రీవాస్తవ ఇంగ్లిష్‌లోకి అనువదించారు.

‘ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆ రోజుల్లో యువతరంలో ఉప్పొంగే దేశభక్తి భావాలు, చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆశా ఏరోజూ వెనకడుగు వేయలేదు’ అంటుంది తన్వీ శ్రీవాస్తవ.

‘ఇది వ్యక్తిగత పుస్తకం కాదు. ఆ రోజుల్లోని పోరాటస్ఫూర్తికి అద్దం పట్టే పుస్తకం’ అంటున్న 94 సంవత్సరాల ఆశా సహాయ్‌ తన కుమారుడితో కలిసి పట్నా (బిహార్‌)లో నివసిస్తోంది. 

చదవండి: అలనాటి ఆకాశ వాణి
Alpana Parida: క్షేమంగా... లాభంగా.. ఫైబర్‌ హెల్మెట్‌.. తక్కువ బరువు!
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top