ఫైబర్‌ హెల్మెట్‌: క్షేమంగా... లాభంగా.. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉంటేనే! | Sakshi
Sakshi News home page

Alpana Parida: క్షేమంగా... లాభంగా.. ఫైబర్‌ హెల్మెట్‌.. తక్కువ బరువు!

Published Sat, Nov 5 2022 4:33 PM

Alpana Parida: Mumbai Based Start Up Helmet Tivra Eco Friendly - Sakshi

బ్రాండ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ఆల్పన పరీదా రైడర్‌ సెంట్రిక్‌ స్టార్టప్‌తో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ‘యువత మనసుతో ఆలోచిస్తాను’ అని చెప్పే పరీదా తన స్నేహితురాలు, వ్యాపార దిగ్గజం ఫల్గుణీ నాయర్‌ చెప్పిన మాటను శిరోధార్యంగా భావిస్తుంది. ‘ఆసక్తి మాత్రమే కాదు. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉండాలి’ అంటూ ముందుకు సాగుతోంది.

బ్రాండ్‌ డిజైన్, డిజైన్‌ థింకింగ్‌ ఏజెన్సీ ‘డివై వర్క్స్‌’లో పనిచేయడానికి ఆల్పన పరీదా బెంగళూరు నుంచి ముంబైకి వెళుతున్నప్పుడు తన మదిలో ఎన్నో ఆలోచనలు. అందులో అనుకూలమైన వాటితోపాటు ప్రతికూలమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ‘డివై వర్క్స్‌’లో చేరిన తరువాత తాను ఉద్యోగి మాత్రమే కాలేదు. విద్యార్థి కూడా అయింది.

‘డిజైన్‌ అనేది కస్టమర్‌ను ఎలా ఆకట్టుకుంటుంది, ప్రాడక్ట్‌ వైపు వచ్చేలా ఎలా చేస్తుంది...మొదలైన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను’ అంటుంది పరీదా. ఫ్రానెస్కో ముట్టి అనే పాస్తా, పిజ్జా సాస్‌ తయారీ కంపెనీ కోసం తాను పని చేయాల్సి వచ్చింది. దీనికోసం క్షేత్రస్థాయిలో ఎంతోమందిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంది.

చాలామంది కస్టమర్స్‌ గ్లాస్‌ జార్స్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న ఆ కంపెనీ గ్లాస్‌ బాటిల్స్‌లో సాస్‌ అమ్మడం మొదలుపెట్టింది. ఇది సత్ఫలితాన్నిచ్చింది.

సొంతంగా కంపెనీ
ఐఐఎం, అహ్మదాబాద్‌లో పీజీడిఎం(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌) చేసింది పరీదా. ‘ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేయలేకపోతున్నాననే బాధ మహిళల్లో ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడేమో, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అందుకే ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అంటుంది పరీదా.

మార్కెటింగ్‌ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన పరీదాకు సొంతంగా కంపెనీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తాను నేర్చుకున్న విషయం గుర్తొచ్చింది.

‘ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేవి ప్రాడక్ట్‌ విషయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఆ తరువాతే... విజువల్‌ ఐడెంటిటీ, బ్రాండ్‌ గురించి ఆలోచించాలి’

ఆ సమయంలో తన దృష్టి హెల్మెట్‌లపై పడింది. మన దేశం టూ–వీలర్స్‌ రైడర్స్‌కు పెట్టింది పేరు. హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. కానీ బైక్‌లతో పోల్చితే హెల్మెట్‌ల డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు.

‘టీవ్ర’కు శ్రీకారం
తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంతోమంది రైడర్స్‌తో మాట్లాడి హెల్మెట్‌ల విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ‘ప్లాస్టిక్‌ అనేది బకెట్స్‌కు బాగుంటుంది. మన తలను రక్షించడానికి కాదు. అందుకే ట్రాక్‌రైడర్స్‌ అందరూ కాంపోజిట్‌ ఫైబర్‌ హెల్మెట్‌లనే వాడతారు’ అంటున్న పరీదా టూ–వీలర్స్‌ కోసం ‘టీవ్ర’కు శ్రీకారం చుట్టింది. గ్లాస్‌ ఫైబర్‌ అండ్‌ కార్బన్‌ ఫైబర్‌ హెల్మెట్‌ల తయారీ కంపెనీ ఇది. తక్కువ బరువు ఉండడం ఈ హెల్మెట్‌ల ప్రత్యేకత.

సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘నైకా’ వ్యవస్థాకురాలు ఫల్గుణీ నాయర్‌ పరీదాకు ఐఐఎం–అహ్మదాబాద్‌లో క్లాస్‌మేట్‌. ఒక విధంగా చెప్పాలంటే పరీదాకు స్ఫూర్తిని ఇచ్చింది నాయరే. పరీదా సాధించిన విజయాలను బట్టి, ఆమెలో ఉత్సాహం మాత్రమే లేదని, సవాళ్లను ఎదుర్కొనే సాహసం మెండుగా ఉందని, ఆ సాహసమే తన వ్యాపారాన్ని ముందుకు నడిపించే ఇంధనమని అర్థం అవుతుంది.          

చదవండి: SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం 
జాబ్‌ మానేయ్‌!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్‌లోకి వెళ్లి.. 

Advertisement
Advertisement