శరీరంలో అలర్జీలు.. నివారణల కోసం అవగాహన అవసరం

Allergies Like Skin Food Treatment Avoid Taking Precautions Doctor Advice - Sakshi

ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనిషిలో తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు... మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారి తీస్తుంది. అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కామన్‌గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.

ఫుడ్‌ అలర్జీ: మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఫుడ్‌ అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్‌ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్‌(ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్‌ నట్స్‌), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపు తిమ్మిర్లు, శ్వాస తీసుకోలేకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్‌ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్‌ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతో పాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్‌) కూడా చేయాల్సి ఉంటుంది.

డస్ట్‌ అలర్జీ: సాధారణంగా డస్ట్‌ అలర్జీ అనేది దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. వీటిని డస్ట్‌ మైట్స్‌ అంటారు. ఈ డస్ట్‌ మైట్స్‌ మనుషుల నుంచి రాలిన చర్మ మృతకణాలను తింటూ ఇంట్లో దుమ్ము, ధూళికి కారణమవుతాయి. ఇవి శ్వాస తీసుకునే క్రమంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ పరిస్థితులు ఈ డస్ట్‌ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి ఇళ్లలో ఉండే దుప్పట్లు, దిండు కవర్లు, టవల్‌లు, తివాచీలు, ఇతర సామాన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్‌ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ గాటు పరీక్ష(స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌)ను నిర్వహించాల్సి ఉంటుంది. డస్ట్‌ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. అరుదైన సందర్భా లలో డస్ట్‌ అలర్జీలు అనాఫిలాక్సిస్‌ షాక్‌కు దారి తీస్తాయి. 

కంటి అలర్జీ: సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన అలర్జీలు అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. పైన పేర్కొన్న కారకాల్లో ఏవి అలర్జీకి కారణం అవుతున్నాయో పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే నివారణ. 
ఈ నాలుగే కాక కొంతమందిలో తేనేటీగలు, కందిరీగలు (ఇన్సెక్ట్‌ అలర్జీ), రబ్బరుతో తయారయ్యే వస్తువులు (బెలూన్, చేతి తొడుగులు, కాండమ్స్‌), కొన్ని రకాల మందులు(డ్రగ్‌ అలర్జీ), ఫంగస్‌(మోల్డ్‌ అలర్జీ) లాంటివి కూడా కనిపిస్తుంటాయి. 


ఏం చేయాలి? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్‌తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్ధ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆతరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్‌ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీలతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్‌ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అందిస్తారు. ఈ రుగ్మతకు శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో మాత్రమే ఉంచుకోవచ్చు.

స్కిన్‌ అలర్జీ: ఈ రకమైన అలర్జీ సంభవించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్‌లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు. స్కిన్‌ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న  విషయం వారికి తెలీదు. స్కిన్‌ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ అలర్జీల కారకాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష (తెల్ల రక్త కణాల పరీక్ష) ద్వారా బాధితుడి లక్షణాలను కొద్దిమేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ.

చదవండి: కరోనా కాలంలో... కంటి సమస్యలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top