Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో | Sakshi
Sakshi News home page

Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో

Published Sun, Mar 24 2024 4:55 AM

Ae Watan Mere Watan is a biopic on freedom fighter Usha Mehta, Sara Ali Khan lead role - Sakshi

బయోపిక్‌

సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్‌ వతన్‌ మేరే వతన్‌’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్‌ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు?

‘దిసీజ్‌ కాంగ్రెస్‌ రేడియో కాలింగ్‌ ఆన్‌ 42.34 మీటర్స్‌ సమ్‌వేర్‌ ఇన్‌ ఇండియా’... ఈ అనౌన్స్‌మెంట్‌ బ్రిటిష్‌ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్‌ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా.

గాంధీ పిలుపు విని...
ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్‌ సమీపంలో ఉన్న సారస్‌ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది.

డూ ఆర్‌ డై
1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్‌ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్‌ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్‌ దాస్‌ ఖాకడ్, చంద్రకాంత్‌ ఝావేరీ, బాబూభాయ్‌ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది.

రహస్య కాంగ్రెస్‌ రేడియో
బ్రిటిష్‌ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా  బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్‌మిటర్‌ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది.

ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్‌ కాంగ్రెస్‌ రేడియో 42.34 మీటర్స్‌ సమ్‌వేర్‌ ఇన్‌ ఇండియా’... అంటూ  స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్‌ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు.

మూడు నెలలు
రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్‌ చిరునామా చెప్పేశాడు. నవంబర్‌ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్‌ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్‌ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్‌ హోమ్‌ మినస్టర్‌గా ఉండగా ఆమె విడుదల జరిగింది.

కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్‌ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది.
ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్‌ ‘అయ్‌ వతన్‌ మేరే వతన్‌’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది.     

Advertisement
 
Advertisement