బౌండరీలు దాటే మనస్సు నాదీ... సెంచరీలు కొట్టే వయస్సు నాది

Actress Sowcar Janaki Exclusive Interview With Sakshi

శంకరమంచి జానకి... షావుకారు చిత్రంతో ఇంటిపేరు మారిపోయింది.. తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చలాకీగా చేసుకుంటున్నారు.. 74 సంవత్సరాల క్రితం నటించిన షావుకారు చిత్రంలోని డైలాగులను నిద్రలో లేపి అడిగినా నేటికీ ఒప్పచెబుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో! వయసు తన శరీరానికే కానీ, తన మనస్సు మాత్రం బౌండరీలు దాటుతోందంటున్న షావుకారు జానకి తన ఆరోగ్య రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే...

నేను బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో.. 1931 డిసెంబరు 11న తూ. గో. జిల్లా రాజమండ్రిలో పుట్టాను. మాది చాలా ఆచారవంతుల కుటుంబం. అమ్మ శచీదేవి, నాన్న టేకుమళ్ల వెంకోజీరావు. అమ్మ పద్ధతులు, శుభ్రత అన్నీ అలవడ్డాయి. నాకు ఇప్పుడు 89 పూర్తయ్యి 90కి వచ్చాను. నా కంటె ముందు అన్నయ్య, అక్కయ్య, నా తరవాత, చెల్లి కృష్ణకుమారి. అక్కయ్య చాలా చిన్నతనంలోనే కన్నుమూసింది. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. నాన్న ఉద్యోగరీత్యా చాలా రాష్ట్రాలకు మారుతుండటం వల్ల నా చదువు సరిగ్గా సాగలేదు. నాన్న హిందూ పేపర్‌ చదవటం అలవాటు చేశారు. మద్రాసు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేర్పించారు. క్రమేపీ తెలుగు రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాను.

బాల్య వివాహం...
పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేసేశారు. మద్రాసు ఆకాశవాణిలో బాలానందం ప్రోగ్రామ్‌ లో నా గొంతు విన్న బి.ఎన్‌. రెడ్డి గారు నన్ను పిలిపించి, ‘సినిమాలో చేస్తావా’ అన్నారు. ఏమీ తెలియక పోయినా ‘చేస్తాను’ అనేసి, ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. నాన్న చీవాట్లు పెట్టి, శంకరమంచి శ్రీనివాసరావుతో నాకు పెళ్లి చేసేశారు. ఆ తరవాత నాన్నగారు బదిలీ మీద అస్సాం వెళ్లిపోయారు.

విజయవాడలో కొత్త కాపురం...
మేం విజయవాడ సత్యనారాయణపురంలో కాపురం పెట్టాం. అయితే ఆయనకు సంపాదన అంతగా లేక పోవడంతో క్రమేపీ మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో మమ్మల్ని అస్సాం రమ్మన్నారు నాన్న. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. పెళ్లి అయ్యాక పుట్టింట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది. అప్పట్లో మా చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. ఊరికే కూర్చోలేక, తనని చదివిస్తూ, నేను ప్రైవేట్‌గా పరీక్ష రాశాను. అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు. నిండు నెలలు, ఓవర్‌కోట్‌ కప్పుకుని పరీక్ష రాశాను.

షావుకారు ఇంటి పేరుగా మారింది..
ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం మర్యాద కాదని, మద్రాసు మా మేనమామ ఇంటికి చేరాం. అక్కడే నాకు పెద్దమ్మాయి యజ్ఞ ప్రభ పుట్టింది. ఒక రోజున మా వారితో, గతంలో నాకు వచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, నేను నటించటానికి ఒప్పించి, బిఎన్‌ రెడ్డిగారిని కలిశాను. చేతిలో పాపాయి, పక్కన మా వారు. ఆయనకు నా కళ్లల్లో మా ఇబ్బంది కనిపించి, వారి తమ్ముడు తీస్తున్న ‘షావుకారు’ చిత్రం గురించి చెప్పారు. ఎన్నో పరీక్షల తరవాత ఆ చిత్రంలో హీరోయిన్‌ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి షావుకారు జానకి అయ్యాను. షావుకారు íసినిమాలో బాగా చేస్తేనే నిలదొక్కుకోగలను అనుకున్నాను. ఇంట్లో మూడు నెలల పాపను వదిలి, తల్లిగా మానసిక వేదన అనుభవిస్తూ, ఆ సినిమా చేశాను. ఆ సినిమాకు 2500 రూపాయలు పారితోషికం. అలా కుటుంబం కోసం సినిమాలలోకి ప్రవేశించాను. నాలుగు కాలాల పాటు ఉండే పాత్రలు చేస్తూ, ‘నువ్వు పనికిరావు’ అన్న కె. వి. రెడ్డిగారితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగాను. శివాజీ గణేశన్‌ గారి ప్రోద్బలంతో పుదియ పరవై అనే తమిళ చిత్రంలో గ్లామర్‌ రోల్‌ చేసి, అందరి ప్రశంసలు అందుకున్నాను.

బాలచందర్‌ నాటకాలలో...
500 సినిమాలు చేసినా, నాటకాల మీద వ్యామోహం పోలేదు. సినిమాలలో చేస్తూనే, పైసా కూడా తీసుకోకుండా 300 నాటకాలు చేశాను. అప్పట్లో కె. బాలచందర్‌ రచన, దర్శకత్వం వహించిన నాటకాలలో కూడా వేశాను.  కలైమామణి అవార్డు, అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్‌ కూడా అందుకున్నాను.

సంవత్సరానికి 20 సినిమాలు చేశాను
‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో, ప్రతిరోజూ ఇలాగే గడవనీ’ అని దేవుడికి దండం పెట్టుకుంటాను. మా కుటుంబం నుంచి ఎవ్వరూ నన్ను ప్రోత్సహిం^è కున్నా, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను. నా కష్టాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌ కు ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేశాను.
ఉదయమే దేవుడికి దండం పెట్టుకుని, కాఫీ, బ్రెడ్‌ తీసుకున్నాక, పేపర్‌ చదువుతాను. ఇప్పుడు కాఫీ మానేసి, వేడినీళ్లు, తేనె, శొంఠి పొడి, జీలకర్ర పొడి కలిపిన నీళ్లు తాగుతున్నాను. ఆరోగ్యకరమైన భోజనం తింటాను. ఎవరినీ బాధపెట్టను. గౌరవంగా, మర్యాదగా, తృప్తిగా బతకడానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి అని కోరుకుంటాను. వీలైతే సహాయం చేస్తూంటాను. పబ్లిసిటీ, ఆర్భాటం ఇష్టం లేదు.

ఇంటిపనే నాకు పెద్ద వ్యాయామం
నాకు వంట బాగా అలవాటు. స్వీట్లలో అరిసెలు ఇష్టం. ఇవి తినాలంటే మిగిలినవి కట్‌ చేసేస్తాను. పెరుగు, అరటి పండు, ఒక కూర/పప్పు/ చారు/పులుసు ఏదో ఒకటి మాత్రమే. వెన్న, నెయ్యి, పాల వంటివి పరిమితంగా తింటాను. ఆరోగ్యకరమైన భోజనం çరోజుకొకసారి చాలు. ఆకలి లేకపోతే పండు తిని, మంచినీళ్లు తాగి పడుకుంటా. ఈ అలవాట్ల వల్ల నాకు సుగర్, బీపీలు లేవు. రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్‌ అయినా పని చేస్తూనే ఉన్నాను. సినిమాలు లేకపోయినా ఇంటి పనే నాకు పెద్ద వ్యాయామం. దేవుడి మీద భక్తి ఉంది. మూఢ నమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని భావిస్తాను.
 

మాట వెనక్కు తీసుకుంటానన్నారు..
పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో ఎరుకలసాని వేషం వేసే అవకాశం వచ్చింది. సాయంత్రం షూటింగ్‌ అయితే, మధ్యాహ్నం చెప్పారు. నేను భయపడ్డాను. పుల్లయ్యగారు ధైర్యం చెప్పి, నాకు ట్రయినింగ్‌ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాత్ర. చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకున్నాను. ఆ సినిమా చూసిన కె. వి. రెడ్డిగారు తన మాటను వెనక్కు తీసుకుంటాను అన్నారు. ఎంతో సంతోషించాను. అదే నాకు నిజమైన సినిమా అనుకుంటాను ఇప్పటికీ.

– సంభాషణ: వైజయంతి పురాణపండ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top