Sheela Bajaj: 78 ఏళ్ల వయసులో డిజైనర్‌గా రాణిస్తున్న షీలా బజాజ్‌

78 Year Old Sheela Bajaj Shares Turns her Passion For Crochet Into profession - Sakshi

‘అభిరుచిని ఆచరణలో పెట్టాలే గానీ ఏ వయసయినా అనుకున్నది సాధించవచ్చు’ అని నిరూపిస్తున్నారు ఢిల్లీలో ఉంటున్న 78 ఏళ్ల షీలా బజాజ్‌. ‘ఇప్పుండెందుకీ పనులు... హాయిగా కూర్చోక’ అని చెప్పేవారికి సవాల్‌గా ‘నా క్రొచెట్‌ డిజైన్స్‌ మీకు కావాలా’అని అడుగుతారు. కొత్తగా ఆన్‌లైన్‌ భాషను వంటపట్టించుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అల్లికల ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చిన ఆర్డర్లను తీసుకుంటూ క్రొచెట్‌ అల్లికల తయారీలో బిజీబిజీగా ఉంటూ, సంపాదన మార్గంలో ఉన్నారు. 

‘నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల కోసం క్రోచెట్‌ అల్లికలు చేసేదాన్ని. ఆ తర్వాత బాధ్యతల నడుమ అభిరుచిని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలు పెద్దగై, వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు నా మనవరాలితో పాటు ఉంటున్నాను. కిందటేడాది కరోనా మహమ్మారి మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక అవసరాలు తీరడానికి ఎటూ దారి దొరకలేదు. మనవరాలిపై ఆధారపడుతున్నానని బెంగ. ఈ మాటలు నా మనవరాలితో అంటూ ఉండటం వల్ల ఓ రోజు ‘మీరు క్రోచెట్‌ అల్లికలు బాగా చేస్తారు కదా! మళ్లీ ఎందుకు మొదలుపెట్టకూడదు మీ కోసం’ అంది.

దాంతో తిరిగి దారాలు నా చేతిలోకి వచ్చాయి. ఈ కాలానికి తగినట్టు అందమైన అల్లికలు రూపొందించడం మొదలుపెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రూపొందించిన డిజైన్స్‌ ఫొటోలు పెట్టాం. మొదటి ఆర్డర్‌కు రూ.350 వచ్చాయి. 78 ఏళ్ల వయసులో నా మొదటి సంపాదన అది. ఎన్నడూ పొందలేనంత అనుభూతిని పొందాను. చాలా గర్వంగా, స్వతంత్రం గా అనిపించింది. డ్యాన్స్‌ చేయాలనిపించింది. అంతగా ఆనందించాను. 

నా వయస్సులో ఉన్న చాలా మంది వ్యక్తులు ‘ఇప్పుడిక చేసేదేముంది’ అంటే, ‘ఇప్పుడు నాకు పని ఉంది ’ అని గర్వంగా చెబుతున్నాను. అలా అన్నవారు కూడా ఇప్పుడు నా ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకుంటున్నారు. దీంతో క్రియేషన్స్‌తో పాటు ఉత్పత్తులూ పెరిగాయి. ఆర్డర్లూ పెరిగాయి. ఈ పనిలో అలసట అన్నదే లేదు ఇప్పుడు. 20 ఏళ్ల యువతి నా క్రోచెట్‌ డ్రెస్‌ను ఇష్టపడుతుంది. ఒక తల్లి తన బిడ్డకు చేసిచ్చిన క్రొచెట్‌ ఫ్రాక్‌ ఎంతో అందంగా ఉందని నాకు చెప్పింది.

వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా కావల్సినది నచ్చిన పని. మన చేతులతో మనం స్వయంగా సంపాదించుకున్న పని. అది ఏదైనా కావచ్చు. ఎవరికి వారు ఎవరిమీదా ఆధారపడకుండా బతికేంత సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా చాలా అవసరం’’ అంటూ ఈ బామ్మ ఆనందంగా చెబుతున్న మాటలు అన్ని వయసులవారినీ ఆలోచింపజేస్తాయి. అనుకున్న పనులను ఆచరణలో పెట్టేలా చేస్తాయి.

చదవండి: Rohit Sharma: రోహిత్‌పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top