ఇవాన్ బడ్జ్ అనే ఈ 16ఏళ్ల కెనడియన్ కుర్రాడు యంత్ర కూర్మాన్ని రూపొందించాడు. సముద్రపు తాబేలు మాదిరిగా కనిపించే ఈ రోబో తాబేలు ఏఐ సాయంతో పనిచేస్తుంది. సముద్ర జలాల్లోకి దీనిని విడిచిపెడితే, అసలు తాబేలు మాదిరిగానే లోలోతుల వరకు చొరబడి ఈదులాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన సెన్సర్లు, దీని ముందు భాగంలోను, అడుగు భాగంలోను అమర్చిన కెమెరాలు సముద్ర జలాల్లోని మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించి, తొలగిస్తాయి.
పగడపు దిబ్బల స్థితిగతుల సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు యాప్ ద్వారా మొబైల్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ‘బయోనిక్ అండర్‌వాటర్ రోబోటిక్ టర్టల్’ (బర్ట్) పేరుతో రూపొందించిన ఈ యంత్ర కూర్మం సాగర జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించగలదని చెబుతున్నారు. నమూనా యంత్ర కూర్మం పనితీరు పరిశీలించాక, మరిన్ని యంత్ర కూర్మాలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టాలని కెనడియన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


