పోలవరం కూటమిలో కొత్త కుంపటి | - | Sakshi
Sakshi News home page

పోలవరం కూటమిలో కొత్త కుంపటి

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

పోలవరం కూటమిలో కొత్త కుంపటి

రాత్రి సమావేశాలు.. తాయిలాల ఎర ?

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల పోరు పోలవరం నియోజకవర్గ కూటమిలో వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. కొయ్యలగూడెం మండలంలోని పరింపూడి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవికి కూటమి మద్దతుతో ఒక అభ్యర్థి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేయగా, చివరి రోజు మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన సన్నిహితురాలితో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేయించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఆధిపత్య పోరుకు వేదిక

సుమారు 13 వేల ఓట్లు ఉన్న పరింపూడి మండలంలోనే అతిపెద్ద పంచాయతీ కావడంతో ఆశావహుల పోటీ తీవ్రంగా ఉంది. తొలి విడత నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. జనసేన నేత కరాటం రాంబాబు ఆదేశాలతో మట్టా సత్తిపండు భార్య వనజా లక్ష్మి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. తమకు జనసేన సహా కూటమి పార్టీల మద్దతు ఉందని ఆమె వర్గీయులు ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలరాజు, కరాటం రాంబాబు వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైరి వర్గానికి చెక్‌ పెట్టేందుకు ఎమ్మెల్యే తన సన్నిహితురాలైన ఓడూరి భారతితో పోటీగా నామినేషన్‌ వేయించారు.

ఎమ్మెల్యే తీరుపై కరాటం వర్గం ఆగ్రహం

రెండు రోజుల క్రితం రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎమ్మెల్యే, ఇప్పుడు స్వయంగా రెబల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని కరాటం వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని తన చర్యను సమర్థించుకున్నారు. వనజా లక్ష్మి నామినేషన్‌ విషయం తనకు తెలియదని, ఆమెతో ఉపసంహరింపజేస్తామని వ్యాఖ్యానించారు.

కూటమి అభ్యర్థికి పోటీగా ఎమ్మెల్యే సన్నిహితురాలి నామినేషన్‌

తారాస్థాయికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కరాటం రాంబాబు వర్గాల పోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చంటూ ఎమ్మెల్యే సమర్థన

మళ్లీ చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే చిర్రి వ్యవహారం

ఓడూరి భారతి గెలుపు కోసం పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే రాత్రి వేళల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కులాల వారీగా, డ్వాక్రా సంఘాలు, ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, తాయిలాలు ప్రకటించినట్లు సమాచారం. ఇటీవల మట్టి మాఫియా నగదు వ్యవహారంలో బహిరంగంగా హడావిడి చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సదరు మహిళ, తాజాగా సర్పంచ్‌ నామినేషన్‌ వేయడంతో నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement