ఉత్సాహంగా గ్రంథాలయ వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా గ్రంథాలయ వారోత్సవాలు

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

ఉత్సాహంగా గ్రంథాలయ వారోత్సవాలు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి 24 వరకు పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలు నిలిపివేత వ్యవసాయరంగ సమస్యల పరిష్కారానికి ఏఐ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం ఉదయం, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏలూరు యూనిట్‌ మెడిటేషన్‌ ట్రైనర్‌ – సెంటర్‌ హెడ్‌ రాజయోగిని బీకే లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్‌ సిటీ – భవిష్యత్‌ నగరం, సహజ వనరులను పరిరక్షించండి – భూ మాతను కాపాడండి అనే అంశాలపై మోడల్‌ మేకింగ్‌ ప్రెజెంటేషన్‌ పోటీలు జరిగాయి. సాయంత్రం జిల్లా రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ స్రవంతి సంఘం ఆధ్వర్యంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతనన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏపీ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పీడీ సుధీర్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, డిప్యూటీ లైబ్రేరియన్‌ ఏ. నారాయణరావు, బీకే రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు: అక్వాన్‌ తుపాఅక్వాన్‌ తుపాను నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. తుపాను ముందస్తు సహాయక చర్యలపై వర్చువల్‌గా జిల్లా యంత్రాంగంతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 20న మధ్యాహ్నం నెల్లూరు – తుని మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. దీని ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాణ, ఆస్తి, పంటల నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.

ఏలూరు (టూటౌన్‌): పోస్టల్‌ డైరెక్టరేట్‌, న్యూఢిల్లీ ఆదేశాల మేరకు, తపాలా శాఖలో పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ), గ్రామీణ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) సేవలను ఈనెల 24 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఏలూరు డివిజన్‌ తపాలా శాఖ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎంసీ కామిష్‌ వ్యవస్థ నుంచి నూతన ఇన్సూరెన్స్‌ మేనేజ్మెంట్‌ సొల్యూషన్‌ (ఐఎంఎస్‌) వ్యవస్థకు మార్పు చేయనున్న నేపథ్యంలో, ఈనెల 24 వరకు ఏలూరు డివిజన్‌ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాలలో ఈ సేవలు నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మార్పిడి ప్రక్రియలో భాగంగా, కొత్త పాలసీల నమోదు, ప్రీమియం చెల్లింపులు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. నూతన ఐఎంఎస్‌ వ్యవస్థ ద్వారా పీఎల్‌ఐ / ఆర్‌పీఎల్‌ఐ సేవలు ఈనెల 25 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.

తాడేపల్లిగూడెం: ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో నివారించుకోవచ్చని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కె. ధనుంజయరావు తెలిపారు. వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సహకారంతో ఫౌండేషన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ అఫ్‌ ఏఐ డేటా సైన్సు ఫర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ స్మార్ట్‌ ఆగ్రో సిస్టమ్స్‌ అనే అంశంపై మంగళవారం శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపగలమన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కళాశాల మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement