ఓఆర్‌ఆర్‌ భూసేకరణపై రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ భూసేకరణపై రైతుల ఆందోళన

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

ఓఆర్‌ఆర్‌ భూసేకరణపై రైతుల ఆందోళన

ఆగిరిపల్లి: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం భూసేకరణ చేపడుతున్న తీరుపై ఆగిరిపల్లి మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌ కారణంగా మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని, ఆగిరిపల్లిలో రైతులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా పొలాల్లో కొలతలు వేసేందుకు అధికారులు రావడం సరైన పద్ధతి కాదన్నారు. సోమవారం బొద్దనపల్లిలో రైతుల భూముల్లో కొలతలు వేసేందుకు రావడాన్ని తప్పుబట్టారు. భూసేకరణ విధానం, రైతులకు కల్పించే పరిహారం, భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం చేసే న్యాయం ఏమిటో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ, పీపీపీ విధానంలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం వంటి అంశాలపై రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. రాజధాని నిర్మాణమే పూర్తికావడానికి మరో 30 ఏళ్లు పడుతుందని చెబుతున్న తరుణంలో ఇప్పుడే ఓఆర్‌ఆర్‌ కోసం భూసేకరణలో ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందని ప్రశ్రించారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారని, మళ్లీ ఓఆర్‌ఆర్‌ పేరుతో భూసేకరణ చేపడితే రైతుల భవిష్యత్తు ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని, రహదారుల నిర్మాణాల కోసం భూములు కోల్పోతే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. ఆగిరిపల్లి మండలంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచకుండా, భూసేకరణ సమయంలో తక్కువ పరిహారం చెల్లించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో గరిష్ఠ భూమి విలువను ప్రామాణికంగా తీసుకొని రైతులందరికీ సమానమైన నష్టపరిహారం అందించాలని కోరారు. ఓఆర్‌ఆర్‌ వల్ల భూములు కోల్పోయే రైతులతో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, వారి సందేహాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు రైతులు పాతూరి రవి, యండురి చంద్రశేఖర్‌, కందుల విక్రమ్‌, అరిగే శ్రీనివాస చారి, మల్లేశ్వర ప్రసాద్‌, పామర్తి రమేష్‌, పుసులూరి ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement