పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా, అత్యుత్తమ నాణ్యతతో జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్ వోహ్రా అన్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్ట్ పనులను సమగ్రంగా సమీక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించి అక్కడికక్కడే నాణ్యత పరీక్షలు నిర్వహించారు. తొలుత ప్రాజెక్ట్ సమావేశ మందిరానికి చేరుకున్న వోహ్రా, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురామ్, చీఫ్ ఇంజనీర్ ఎం.రమేష్ కుమార్.. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు. గత పర్యటనలో తాను చేసిన సూచనలు, విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహాల అమలు తీరును సీఈఓ అడిగి తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున పనులకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వోహ్రా, పీపీఏ అధికారులతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతం, జి–హిల్, జి–డ్యాష్ హిల్ ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. మట్టి, ఇసుక, రాయి, కంకర, కాంక్రీట్ నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, నిరంతరం నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ రికార్డులు భద్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ కె.నరసింహ మూర్తి, పోలవరం ఎస్‌ఈ పి.రామచంద్రరావు, నాణ్యత విభాగం సీఈ శేషుబాబు, ఎస్‌ఈ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.


