ఏలూరు టౌన్: జిల్లాలో అమలవుతున్న సంజీవని, పాజిటివ్ పర్సెప్షన్, ఎల్సీడీసీ సర్వే, మాతాశిశు ఆరోగ్యసేవలు తదితర సేవల్లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఏలూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, సంజీవని కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని చెప్పారు. మాతాశిశు ఆరోగ్య సేవల్లో భాగంగా గర్భిణుల గుర్తింపు, సురక్షిత ప్రసవాలు, ప్రసవానంతర సేవలపై దృష్టి సారించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా నిరోధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వట్లూరు ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. డీఎంహెచ్ఓ యు.శోభ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలు, సేవలు పురోగతి, సాధించిన లక్ష్యాలను, ఎదురయ్యే సవాళ్లను ఆయనకు వివరించారు.


