రైతన్నకు బీమా ధీమా ఏదీ? | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు బీమా ధీమా ఏదీ?

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో అందించిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సాయం

మొత్తం నేలపాలైంది

మరో తుపాను అంటున్నారు

‘‘బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే పంటల బీమా పథకం కింద నష్టపరిహారం అందుతుంది. ప్రీమియం చెల్లించి పంటల బీమా చేసుకున్న రైతులను అభినందిస్తున్నాను’’ – ఇటీవల నరసాపురం పర్యటనలో చంద్రబాబు. ఏడాదైనా మోంథా తుపాను ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదని రైతులు చెప్పగా సమాధానం దాటవేస్తూ ముందుకు సాగిపోయారు.

సాక్షి, భీమవరం: జిల్లాలోని 87 వేల హెక్టార్ల ఖరీఫ్‌ ఆయకట్టుకు సాగు చివరిలో వచ్చిన అర్నబ్‌, మురసు తుపానులు కర్షకులను కోలుకోలేని దెబ్బతీశాయి. గత నెల 28వ తేదీ మొదలు రెండు వారాలుగా 71,333 హెక్టార్లలోని పంట నేలకొరిగి నీటిలోనే ఉంది. మరోపక్క బంగాళాఖాతంలో అల్పపీడనం బెంబేలెత్తిస్తోంది. బలపడితే ఆక్వాన్‌ తుపానుగా మారనుంది.

నిండా ముంచిన చంద్రబాబు సర్కారు:

విపత్తులతో పంటకు నష్టం జరిగితే పంటల బీమా ఆదుకుంటుంది. ప్రీమియం సొమ్ములో 1.5 శాతం రైతు చెల్లిస్తే, 0.5 శాతం ప్రభుత్వం చెల్లించేది. అవగాహన లేక చాలామంది క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేయించక నష్టపోయేవారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. ఈ క్రాఫ్‌ ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడం వల్ల ప్రతి ఎకరాకూ బీమా వర్తించేది. పంట నష్టం జరిగితే రైతులతో పాటు కౌలు రైతులకు పరిహారం అందేది. ఉచిత పంటల బీమాను చంద్రబాబు సర్కారు ఎత్తివేయడంతో రైతులే ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో కేవలం 34,143 హెక్టార్లకు మాత్రమే 64,109 మంది రైతులు క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోగా మిగిలిన ఆయకట్టుకు బీమా లేదు. గత ఖరీఫ్‌లో మోంథా తుపానుతో 9,200 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లితే ఏడాదైనా రూ. 23 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ, క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదని రైతులు విమర్శిస్తున్నారు.

ఆందోళనలో రైతులు : ఇప్పటికే జిల్లాలోని 71,333 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా యనమదుర్రు, ఎర్రకాలువ, ఉప్పుటేరు, గోస్తని తదితర డ్రెయిన్లు పొంగిప్రవహిస్తూ తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, అత్తిలి, ఇరగవరం, పాలకోడేరు, నరసాపురం, భీమవరం రూరల్‌, పెనుమంట్ర తదితర చోట్ల పొలాల్లో ముంపునీరు లాగకపోవడంతో పూర్తిస్థాయిలో పంట నష్టం సర్వే మొదలుకాలేదు. ప్రస్తుతం పంట కోత దశకు చేరుకుంది. హెక్టారుకు రూ. 70 వేలు వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. చాలాచోట్ల రెండు వారాలుగా పంట నీట మునిగి ఉండటంతో వరిపైరు కుళ్లిపోయి కోతకు పనికిరాదంటున్నారు. నేలనంటిన చోట మొలకలు వస్తుండటం, రంగుమారడం తదితర నష్టం జరిగి పెట్టుబడులు దక్కవని వాపోతున్నారు. ఈ దశలో మరో తుపాను వస్తే మొత్తం తుడుచుపెట్టుకు పోతుందని ఆందోళన చెందుతున్నారు.

అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం:

జగన్‌ హయాంలో విపత్తులు వచ్చినప్పుడు నెల రోజులలోపే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందజేసి అండగా నిలిచారు. ఆయన హయాంలో జిల్లాలోని 1,09,556 మంది రైతులకు రూ. 103.44 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందజేశారు. బీమా పరిహారంగా 1,14,011 మంది రైతులకు రూ. 217.64 కోట్లు అందించి ఆదుకున్నారు.

తాడేపల్లిగూడెంలో కోతకుపనికిరాకుండా కుళ్లిపోయిన వరిపంట

పాలకోడేరులో పదిరోజులుగా నీటిలో మునిగి కుళ్లిపోతున్న వరిపంట

సంవత్సరం రైతులు ప్రభుత్వ సాయం

2019 509 రూ. 25.17 లక్షలు

2020 79,430 రూ. 56.89 కోట్లు

2021 27,935 రూ. 19.87 కోట్లు

2022 1,378 రూ. 90.56 లక్షలు

2023 304 రూ. 23.5 లక్షలు

2024 30459 రూ. 25.24 కోట్లు

ఆందోళన కలిగిస్తున్న మరో అల్పపీడనం

అర్నబ్‌, మురసుతో జిల్లాలో 71 వేల హెక్టార్లలోని పంటకు నష్టం

39 శాతం ఆయకట్టుకు మాత్రమే క్రాప్‌ ఇన్సూరెన్స్‌

ఏడాదైనా అందని మోంథా పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ

ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలతో రైతులకు అండగా నిలిచిన జగన్‌

ఆరు ఎకరాల్లో కౌలు సాగుచేస్తున్నాను. రూ. 1.8 లక్షలు వరకు పెట్టుబడులయ్యాయి. తుపాన్లు వల్ల పంట మొత్తం నీళ్లలో మునిగి కుళ్లిపోతోంది. గతేడాది మోంథా తుపాను ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందలేదు. ప్రీమియం చెల్లించలేదని పంటల బీమా రాదంటున్నారు.

– రాయుడు రమణ, కౌలురైతు, ఆరుళ్ల

మూడు ఎకరాల్లో తొలకరి సాగుచేశాను. 150 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాం. ఇంతలోనే వరుసగాా రెండు తుపానులు విరుచుకుపడి ముంచేశాయి. మళ్లీ ఇప్పుడు మరో తుపాను అంటున్నారు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ముంపుతో ఇప్పటికే చేలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

– తోలేటి వెంకటేశ్వరరావు, రైతు, తిరుపతిపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement