ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ స్థాయిలో త్వరలో జరగనున్న సివిల్ సర్వీసెస్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 30 మంది క్రీడాకారులు హాజరుకాగా, వారిలో 22 మందితో ప్రధాన జట్టును, మరో ఇద్దరిని స్టాండ్‌బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు. ఏపీ సచివాలయం నుంచి ఏఎస్‌ఓ ప్రవీణ్, శాప్ ఫుట్‌బాల్ కోచ్ పి. రవికుమార్ హాజరుకాగా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.ఏ. అజీజ్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సీఈఓ జి. పవన్ కుమార్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుండి 24 వరకు గోవాలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి తెలిపారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం వైద్య శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో హెచ్‌ఐవీ నిర్మూలనకు అవగాహనే కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పరిశ్రమలు మరియు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పరీక్షలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులుగా గుర్తించిన వారి వివరాలు సేకరించి వెంటనే చికిత్స అందించాలన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి వివరాలను నమోదు చేసుకుని, ఇతరులకు సోకకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు. శోభ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ బేబీ కమల, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉద్యాన పంటల సాగుకు తేనెటీగల పెంపకం అత్యంత ముఖ్యమని, నాణ్యమైన తేనె ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు తెలిపారు. వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నిర్వహించనున్న వారం రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మొదటి బ్యాచ్: నవంబర్ 16 నుండి 22 వరకు, రెండో బ్యాచ్: డిసెంబర్ 14 నుండి 20 వరకు, మూడో బ్యాచ్: ఫిబ్రవరి 1 నుండి 13 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి బ్యాచ్‌లో 25 మందికి శాసీ్త్రయ పద్ధతిలో శిక్షణనిచ్చి, ఉచితంగా భోజన వసతులు కల్పిస్తామని, ఉద్యాన రైతులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే 24 రకాల పరికరాలు, తేనెటీగల పెట్టెలను రాయితీపై అందిస్తామని చెప్పారు. వివరాలకు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్. కిరణ్‌కుమార్ (73826 33692), శాస్త్రవేత్త డాక్టర్ కె. అర్చన (95024 35151) నంబర్లను సంప్రదించాలన్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కలిదిండి మండల మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి చందన ఉమామహేశ్వరరావు(ఉమా)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


