పవిత్ర కార్తీక మాసోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పవిత్ర కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

భీమవరం (ప్రకాశం చౌక్‌): పవిత్ర కార్తీక మాసోత్సవాలు భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్విరామంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో ప్రముఖ శివక్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

ఆర్జేసీ త్రినాథరావు పర్యవేక్షణ

దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ వేండ్ర త్రినాథరావు ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలోని ఏర్పాట్లు, ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించారు. కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్తీక సోమవారాల్లో సుమారు 30 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దాతల సహకారంతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

క్షీరారామంలో...

పాలకొల్లు సెంట్రల్‌: క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కార్తీకమాస పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయాన్ని తెరువగా అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కాలువలో స్నానాలు ఆచరించి, అక్కడ కార్తీక దీపాలు వదిలి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఆలయంలో దీపాలు వెలిగించారు. పాడ్యమి తిథి పురస్కరించుకుని సోమవారం రాత్రే ఆకాశదీపాలను వెలిగించారు. కార్తీక మాస దీక్షాపరులు మహన్యాసపూర్వక అభిషేకాలు చేయించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మీసాల రామచంద్రరావు, ఈవో రాపాక శ్రీనివాస్‌, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement