2 గంటల్లో 37వేల ఓట్లు | - | Sakshi
Sakshi News home page

2 గంటల్లో 37వేల ఓట్లు

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

ఏలూరు కార్పొరేషన్‌లో చివరి రెండు గంటల్లో 15.74 శాతం పోలింగ్‌

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా కలెక్టర్‌ పరిశీలన

పోలింగ్‌ శాతం

ఏలూరు కార్పొరేషన్‌లో చివరి రెండు గంటల్లో 15.74 శాతం పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పుర పోరు తొలి అంకం ముగిసింది. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీల్లో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అత్యధికంగా నూజివీడులో, అత్యల్పంగా ఏలూరులో పోలింగ్‌ నమోదైంది. ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం చివరి రెండు గంటల్లో 37 వేలకు పైగా ఓట్లు పోలైనట్టు ప్రకటించారు. జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో 130 వార్డుల్లో 3,28,671 మంది ఓటర్లకుగాను 2,02,154 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏలూరులో స్వల్ప ఘర్షణలు మినహా..

ఏలూరు నగరంలో ఒకటి, రెండు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగానే పోలింగ్‌ ప్రక్రియ జరిగింది. ప్రధానంగా ఏలూరులో పోలింగ్‌ శాతం అత్యల్పంగా నమోదైంది. ఉదయం నుంచే మందకొడిగా పోలింగ్‌ కొనసాగింది. ఏలూరు నగరంలో 62 డివిజన్లలో 255 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటుచేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 8 గంటల పాటు 43 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఇక జంగారెడ్డిగూడెంలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి కొనసాగింది. నూజివీడులో మాత్రమే 70 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. ఏలూరు నగరంలో 3 గంటల నుంచి 5 గంటల మధ్య 37,344 ఓట్లు పోలయ్యాయని, దీంతో 43.84 శాతం నుంచి 59.58కి పోలింగ్‌ చేరింది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా జనం పెద్దగా కనిపించకపోవడం, భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరలేదు. సగటున వెయ్యి ఓట్లకు ఒక బూత్‌ను ఏలూరులో ఏర్పాటుచేశారు. 2,37,256 మండి ఓటర్లు ఉండగా వారిలో 1,41,506 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 67,919, మహిళలు 73,564, ఇతరులు 23 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జంగారెడ్డిగూడెంలో..

జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో 32 వార్డులో 64 పోలింగ్‌ కేంద్రాల్లో 48,463 మంది ఓటర్లు ఉండగా వారిలో 29,591 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 61.06 శాతం పోలింగ్‌ నమోదైంది.

నూజివీడులో..

నూజివీడు మున్సిపాల్టీలో 36 వార్డులో 57 పోలింగ్‌ కేంద్రాల్లో 42,952 మంది ఓటర్లు ఉండగా వారిలో 31,055 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 72.30 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీల్లో ఆదివారం జరిగిన పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ప్రతిపోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల క్యూలైన్లు, పరిసరాల్లో, పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఓటు వేసే విధానంలో గోప్యత ఉన్నదా.. లేదా.. అనే విషయాన్నీ కూడా పరిశీలించారు. ఎక్కడైనా ప్రజలు గుమిగూడినట్లు కనిపిస్తే సంబంధిత పోలిస్‌ అధికారికి, సిబ్బందికి ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు, పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను అనుసరించి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణ జరిగేలా పర్యవేక్షించారు.

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

నగరంలోని మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాథమిక పాఠశాల, ఏఆర్‌డీజీకే పాఠశాల, సీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, వెన్నవల్లివారిపేట బీఆర్‌ అంబేడ్కర్‌ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తనికీ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లతో మాట్లాడారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు 43.84 శాతం

నూజివీడులో అత్యధికం,

ఏలూరులో అత్యల్పం

మందకొడిగా మున్సిపల్‌ పోలింగ్‌

జిల్లాలో 61.51 శాతం నమోదు

ఓటర్లలో కనిపించని ఆసక్తి

రేపు కౌంటింగ్‌

పట్టణం ఉ. 9 గం 11 గం మ.1 గం 3 గం 5 గం

ఏలూరు 6.45 26.10 34.25 43.84 59.58

జంగారెడ్డిగూడెం 4.31 28.42 42.57 54.28 61.06

నూజివీడు 14.70 24.53 49.87 62.63 72.30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement