కొల్లేరు బరిలో హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు బరిలో హోరాహోరీ

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కొల్లేరు గ్రామాల చుట్టూ స్థానిక సంస్థల రాజకీయం తిరుగుతోంది. కై కలూరు మండల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పెంచికలమర్రుకు చెందిన మాజీ సర్పంచ్‌ జయమంగళ కాసులు బరిలో ఉండగా టీడీపీ తరఫున కొట్టాడకు చెందిన బలే ఏసురాజు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొల్లేరు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో, లంక గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఇప్పటికే లంక గ్రామాల్లో కాసులు విజయం కోసం ప్రచారం నిర్వహించారు. అలాగే, బలే ఏసురాజు తరఫున కై కలూరు ఎమ్మెల్యే, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ ప్రచారం చేశారు.

జోరుగా ప్రచారం

కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కై కలూరు మండలంలో శృంగవరప్పాడు, పందిరిపల్లిగూడెం, కొట్టాడ, చటాకాయి, మండవల్లి మండలంలో చింతపాడు, పెనుమాకలంక, పులపర్రు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలోని మరికొన్ని కొల్లేరు గ్రామాలను కలుపుకుని కై కలూరు మండలంలో 12,387, మండవల్లి మండలంలో 8,901 ఓట్లు కలిపి మొత్తం 21,288 కొల్లేరు గ్రామాల ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా కై కలూరు జెడ్పీటీసీ అభ్యర్థులు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గ్రామాల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.

అక్రమ చేపల చెరువుల చుట్టూ రాజకీయం

కూటమికి ఓట్లు వేయకపోతే అక్రమంగా సాగు చేస్తున్న చెరువులకు ఇబ్బందులు తప్పవనే విషయాన్ని నాయకులు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని కొల్లేరు పెద్దలు తప్పనిసరి పరిస్థితుల్లో కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి గ్రామ ప్రజల్లో అధికశాతం మందికి దీనిపై సుముఖత లేదు. లంక గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సైతం కొల్లేరు పెద్దలు, ప్రజల నుంచి భారీగా స్వాగతం లభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, సుప్రీంకోర్టు పర్యావరణం పేరుతో కొరడా ఝలిపిస్తున్నా, కూటమి నేతల దాటవేత ధోరణి, మాటలపై గ్రామ ప్రజల్లో నమ్మకం సడలింది. కేవలం ఓట్ల కోసమే మభ్యపెడుతున్నారనే అంచనాకు వారు వచ్చారు.

కొల్లేరులో తప్పుతున్న కట్టుబాట్లు

ప్రతి ఎన్నికల్లోనూ కొల్లేరు ఓట్లు అభ్యర్థుల విజయంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇక్కడ గ్రామ పెద్దలు చెప్పిందే వేదం. ఒకే పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడుతుంటాయి. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరూ కొల్లేరు బిడ్డలే బరిలో నిలవడం గమనార్హం. ఇదిలా ఉంటే, కొల్లేరు గ్రామమైన పందిరిపల్లిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేయాల్సిన కై కలూరుకు చెందిన ఎంపీపీ అభ్యర్థి బూరుబోయిన పద్మాదేవిని టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేర్చి ఇక్కడ నుంచి పోటీకి నిలపడంపై కొల్లేరు పెద్దలు గుర్రుగా ఉన్నారు. తమకు రావాల్సిన ఎంపీటీసీ స్థానాన్ని రాజకీయ ఎత్తుగడల్లో పావుగా వాడుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిణామాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్రమ చేపల చెరువుల చుట్టూ రాజకీయం

కూటమికి ఓటేస్తేనే చెరువులకు రక్షణ అంటూ ప్రచారం

జెట్పీటీసీ అభ్యర్థులిద్దరూ కొల్లేరు బిడ్డలే

వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే ప్రజలు మొగ్గు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement