ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా విధులు కేటాయిస్తూ, చివరి నిమిషంలో వాటిని మారుస్తూ గందరగోళం సృష్టిస్తోంది. జిల్లాలో ఆదివారం జరిగిన నగరపాలక, పురపాలక ఎన్నికలకు విధులు కేటాయించిన ప్రభుత్వం.. అప్పటికప్పుడు ముందుగా నియమించిన ప్రాంతాలను కాకుండా, కొత్త ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ నెల 5న జిల్లావ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మరింత విచిత్రంగా విధులు కేటాయించి ఆందోళనను మరింత పెంచుతోంది.
ఏలూరు నుంచి
వేలేరుపాడు, కుక్కునూరుకు..
స్థానికంగా పనిచేసే ఉపాధ్యాయులకు వారి సొంత ప్రాంతాల్లో ఎన్నికల విధులు కేటాయించకూడదనే నిబంధనను సాకుగా చూపి, అలవికాని దూరాల్లో విధులు కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతానికి సమీపంలో విధులు వేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. పక్క మండలానికో లేదా ఆనుకుని ఉన్న మండలానికో కేటాయించవచ్చు. కానీ, ఏకంగా 150–200 కిలోమీటర్ల దూరానికి వెళ్లి విధులు నిర్వహించమంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఏలూరులో పనిచేసే ఉపాధ్యాయులకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను కేటాయించారు. అలాగే, ఆ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులకు ఏలూరు దాటి కలిదిండి మండలానికి విధులకు వెళ్లాలని ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జిల్లాలో మరో మూల ఉండే ముదినేపల్లి మండలం నుంచి చింతలపూడి దగ్గరిలోని టి.నరసాపురంలో విధులు కేటాయిస్తే తాము ఎలా వెళ్లగలమని నిలదీస్తున్నారు.
కరువైన మానవీయ కోణం
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఎన్నికల విధులను నిర్వహించడం ఉపాధ్యాయులకు కష్టమేమీ కాదని, అయితే అధికారుల కేటాయింపుల్లో మానవీయ కోణం కరువైందని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మానసిక దివ్యాంగులైన పిల్లలను దగ్గరుండి చూసుకోవాల్సిన వారు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారు ఇప్పటికే అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారి వినతులను తోసిరాజని, వ్యాధిగ్రస్తులకు సైతం దూర ప్రాంతాల్లో విధులు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన మహిళా ఉపాధ్యాయులకు కూడా 150 కిలోమీటర్ల దూరంలో విధులు కేటాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
గగ్గోలు పెడుతున్న టీచర్లు
అసాధ్యమైన రీతిలో ఎన్నికల విధులు కేటాయించడంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. దూర ప్రాంతాల్లో విధులు కేటాయించిన ఉపాధ్యాయులకు సోమవారమే ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం ఒకసారి, ఎన్నికల రోజు మరోసారి అంత దూరం ప్రయాణించడం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మహిళలకు కష్టసాధ్యమని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై మినహాయింపు పొందడానికి ఆదివారం సంబంధిత అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, అదే రోజు మున్సిపల్ ఎన్నికలు జరగడంతో తమ గోడును పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో అధికారులు పునరాలోచించి, తమకు సమీపంలోని మండలాల్లో విధులు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల దిద్దుబాటు చర్య
ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు తొలుత ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసినట్టు ఆదివారం రాత్రి ఉపాధ్యాయులకు మెసేజ్ల ద్వారా తెలిపారు. కంప్యూటర్ ఆధారిత ర్యాండమైజేషన్ చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని అధికారులు సన్నాయి నొక్కులు నొక్కినట్టు ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. అయితే సోమవారం ఉదయం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించవలసి ఉన్నందున ఆదివారం అర్ధరాత్రికి ఉపాధ్యాయులకు కేటాయించిన మండలాలను మార్చి దగ్గరలోని మండలాలకు కేటాయించే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
150– 200 కిలోమీటర్ల దూరంలో ఎన్నికల విధులు
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ మినహాయింపు లేదు
గగ్గోలు పెడుతున్న టీచర్లు


