కొనుగోళ్లు క్లోజ్
ధాన్యం తీసుకోవడం లేదు
సాక్షి, భీమవరం: వరి సాగు చివరిలో అర్నబ్ తుపా ను రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే.. ఇదే అదునుగా దళారులు దోపిడీకి తెరలేపే పనిలో పడ్డారు. నిన్నమొన్నటి వరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఒక్కసారిగా కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందోనని చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
చి‘వరి’లో కలవరపాటు
ఉమ్మడి జిల్లాలోని 4.88 లక్షల ఎకరాల్లో రైతులు తొలకరి సాగు చేశారు. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 2.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఏలూరు జిల్లాలో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగు ప్రారంభంలో నీటి ఎద్దడి ఇబ్బందులకు గురిచేస్తే చివరిలో భారీ వర్షాలు కలవరపెడుతున్నాయి. ఈనెల మొదటి వారంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా లెక్కలు కట్టారు. తాజాగా తుపాను బెంబేలెత్తిస్తోంది. దీని ప్రభావం వలన మంగళ, బుధవారాల్లో తీవ్రగాలులతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
1,500 ఎకరాల్లో కోతలు పూర్తి
నీటి ఎద్దడి సమస్యతో సాగు ఆలస్యమైన ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పంట చాలాచోట్ల ఈనిక, పూత దశల్లో ఉంది. పశ్చిమలో ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం ప్రాంతంలో కొద్దిరోజుల క్రితమే మాసూళ్లు మొదల య్యాయి. సోమవారం నాటికి దాదాపు 1,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. అత్తిలి, పెంటపాడు, తణుకు, ఇరగవరం, వీరవాసరం, భీమవరం, తదితర చోట్ల మరో రెండు వారాల్లో వరి కోతలు మొదలుకానున్నాయి.
దోపిడీ షరా మామూలే
కూటమి ప్రభుత్వ హయాంలో సాగు చివరిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అడ్డం పెట్టుకుని దళారులు దోపిడీకి తెరలేపడం సర్వసాధారణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తేమశాతం ఎక్కువనో, తాలుగింజలు ఉన్నాయనో సాకుగా చూపించి బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు కోత పెట్టడం తెలిసిందే. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందోనన్న భయంతో చాలామంది రైతులు అయినకాడికి ధాన్యాన్ని అమ్ముకోవడం ద్వారా ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి.
2026–27 సీజన్‌కు గాను క్వింటాల్‌కు కామన్ వైరెటీకి రూ.2,441, గ్రేడ్–ఏ రకానికి రూ.2,461లు కనీస మద్దతు ధరగా ప్రభు త్వం నిర్ణయించింది. నవంబరు 5న తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు సివిల్ సప్లయీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముందుగా వరి కోతలు మొదలైన తాడేపల్లిగూడెం రూరల్ ఏరియాలో మిల్లులకు ధాన్యం రవాణ చేస్తున్నట్టు స్థానిక రైతులు చెబుతున్నారు. తుపాను సాకుగా చూపించి రెండు రోజులుగా ధాన్యం తీసుకోవడం నిలిపివేశారంటున్నారు. చేతికొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకుందామంటే కొనుగోలు చేసే నాథుడు లేక ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, తూర్పుగోదావరి జిల్లాలోని మిల్లులకు తరలించుకోమని సూచిస్తున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విపత్తుల సమయంలో రైతులకు అండగా త్వరితగతిన ధాన్యం కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకునే వారని, రెండేళ్లుగా ఆ పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ప్రస్తుత విపత్తు నుంచి తమను గట్టెక్కించేందుకు అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రా‘ధాన్యం’ ఏదీ?
వణికిస్తున్న అర్నబ్ తుపాను
ఉమ్మడి జిల్లాలో 4.88 ఎకరాల్లో వరి సాగు
తాడేపల్లిగూడెం ప్రాంతంలోమొదలైన కోతలు
రెండు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిపివేత
అదును చూసి మిల్లర్లు ఆపేశారని అన్నదాతల ఆవేదన
జిల్లాలో తెరుచుకోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
మొన్నటివరకూ మా ప్రాంతంలోని మిల్లుల్లో ధాన్యం తీసుకున్నారు. తుపాను సాకుగా చూపించి ధర తగ్గించేందుకు రెండు రోజులుగా ధాన్యం తీసుకోవడం ఆపేశారు. వ్యవసాయాధికారులకు చెబితే తూర్పుగోదావరి జిల్లాలోని మిల్లులకు తరలించుకోమని చెబుతున్నారు. మిల్లర్లకు ప్రభుత్వం సబ్సిడీపై డ్రయర్లు ఎందుకు ఇచ్చినట్టు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
–ములగాల గంగారావు, రైతు, దండగర్రు


