ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల: మంగళ వాయిద్యాల మధుర నాదాలు.. వేద మంత్రోచ్ఛరణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. వెరసి ద్వారకాతిరుమల క్షే త్రం భక్తిభావంతో పులకించింది. ఉభయదేవేరులతో కలసి దివ్య రథంపై కొలువుదీరిన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తజనం తన్మయత్వం చెందారు. ద్వారకాతిరుమలలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి విశేష పూజలు చేశారు. అనంతరం కల్యాణమూర్తులను రథం వద్దకు తీసుకుని సింహాసనంపై ఆశీనులను చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు పూజలు చేసి బలిహరణ సమర్పించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా సాగింది. రథాన్ని లా గుతూ భక్తులు స్వామివారికి నీరాజనాలు అర్పించారు. ఇదిలా ఉండగా ఆలయ ముఖ మండపంలో స్వామివారు పాండురంగడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 10.30 గంటలకు శ్రీచక్రస్నానం
● రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ. అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం
● ప్రత్యేక అలంకారం: నవనీత కృష్ణ
పాండురంగడు అలంకారంలో..
ఆలయ ఈఓ త్రినాథరావు దంపతులు


