ఓటును మూటతో కొనొద్దు మామా! | - | Sakshi
Sakshi News home page

ఓటును మూటతో కొనొద్దు మామా!

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

రాష్ట్రమంతా స్థానిక సంస్థల

ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. గ్రామాల్లో ఏ నలుగురు కలసినా ఎన్నికలపైనే చర్చ. పొద్దు గూకితే చాలు.. చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడే పెద్దల సందడి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి దీటుగా వైఎస్సార్‌సీపీ నామినేషన్లు సైతం దాఖలు చేసింది. ప్రస్తుత ఎన్నికలపై గ్రామ పెద్దల మధ్య సాగిన సంభాషణను

పరిశీలిస్తే..

పరంధామయ్య : ఏరా.. నాగులు ఎదో ఎలినోనా ప్రభావమంటా.. ఎండలు మండిపోతున్నాయ్‌.. మన ఊరి ఊటబావి నీరు కూడా అడుగంటింది.. ఏంట్రా ఈ పరిస్థితి?

నాగులు : అవును.. మామా. ఎండలు సంగతి అటుంచు.. మన గ్రామానికి కాల్వ నీరు వచ్చి ఎన్నాళ్లయ్యింది.. నారుమడలు చచ్చిపోయాయి. ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు ఒంగి, ఒంగి దండాలు పెడతారు.. గెలిచాక మన ముఖం చూడరు.. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు..

పరంధామయ్య: అది సరేగాని నాగులు.. మన పంచాయతీ దగ్గర ప్రకటనల బోర్డులను తీసేస్తున్నారు.. ఎందుకంటావు?

నాగులు : అదా.. మామ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల తేదీలు ప్రకటించారుగా.. వచ్చే నెల 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, 29న సర్పంచ్‌ ఎన్నికలకు మనం ఓట్లు వేయబోతున్నాం.. అదిగో మన బషీరు వస్తున్నాడు.. వాడికి రాజకీయాలు బాగా తెలుసు.. ఇదిగో బషీరు.. ఇటు రా..

బషీరు : ఏంటీ.. మామా అల్లుళ్లు ఏదో సీరియస్‌ విషయం మాట్లాడుకుంటున్నారు.. కాస్త మాకు చెప్పండి వినిపెడతాం...

పరంధామయ్య : అదేం లేదు... బషీరు ఈసారి ఎన్నికల్లో ఏఏ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటావ్‌..

బషీరు : ఇందులో వేరా చెప్పాలా.. వైఎస్సార్‌సీపీ, కూటమి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది.. ఈసారి స్థానిక ఎన్నికల పోరు రసపట్టుగా ఉంటుందని ఎక్కువ మంది చెబుతున్నారండీ.

కొమరయ్య : (నేలపై దుమ్మును కండువాతో తుడుస్తూ..) మీరేనా.. నాకూ కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వండి.. ఇదిగో బషీరు.. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి నెలకు రూ.3,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. రెండున్నరేళ్లు అయినా అమలు లేదు.. ఇదేక్కడి న్యాయం?

బషీరు : నువ్వు చెప్పింది నిజమే కొమరయ్యా.. మా అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క పైసా విదిల్చలేదు. ఇదే పరిస్థితి అన్ని చోట్లా ఉంది. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కోసం కూటమి నేతలు వచ్చేస్తున్నారు. అందరికీ ఎన్నికల తాయిలాల ఆశ పెడుతున్నారు.

కొమరయ్య: బషీరు ఇంకో విషయం చెబుతాను విను.. చంద్రబాబు ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. చాలా మందికి రాలేదు. పైగా మార్కెట్‌లో సిలిండర్‌ వెయ్యిపైనే కొనాల్సి వస్తోంది. చేసిన వాగ్దానాలు నాయకులు ఎలా మర్చిపోతారో అర్థం కావడం లేదు..!

బషీరు : నిజమే కొమరయ్య.. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌లంటూ పథకాలు ప్రకటించడం.. గెలిచిన తర్వాత పూర్తిగా అమలు చేయట్లేదు.. పైగా ప్రశ్నిస్తే వ్యకిగతంగా దాడులు సైతం చేస్తున్నారు.. మహానుభావుడు రాజన్న బతికున్నప్పుడు ఆ రోజులు వేరయ్యా.. మంచోళ్లను దేవుడు ముందే తీసుకుపోతాడు..!

కొమరయ్య : ఇదిగో బషీరు.. కంగారుగా నిప్పు తొక్కిన కోతిలా పరిగెత్తుకెళుతోంది... మన వెంకటాద్రి కదా.. ఇటు పిలువు.

బషీరు : అరే.. వెంకటాద్రి.. ఏంటా ఉరుకులు, పరుగులు.. కొమరయ్య పిలుత్తున్నాడు.. రా.

వెంకటాద్రి: (ఆయాసంగా ఊగుతూ) ఏం చెప్పను కొమరయ్య మా చెల్లిని పిడుగురాళ్లకి ఇచ్చాను. మొన్న నామినేషన్‌ వేయడానికి వెళితే టీడీపీ వాళ్లంతా చేతిలో నామినేషన్‌ లాగేసికుని చించేసి గొడవకు దిగారు.. పోలీసుల ఎదుటే ఇది జరిగింది. ఆస్పత్రిలో చేర్చారంటా.. నేనూ అర్జంటుగా వెళ్లాలి.

కొమరయ్య : మీ కుటుంబంలో మాత్రమే కాదు వెంకటాద్రి.. రాష్ట్రంలో ప్రొద్దుటూరు, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లోనూ నామినేషన్‌ పత్రాలు చించేశారు. రెండేన్నరేళ్లు స్వర్ణయుగం అని చెప్పుకుంటున్నప్పుడు ఓట్లు దండిగా పడతాయి కదా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు చించడం దేనికీ?

కనకమ్మ (కొమరయ్య భార్య): ఏమయ్యో.. మీ బామర్ది కొల్లేరు నుంచి పెద్ద పెద్ద కొరమేనులు పంపాడు.. చింతపండు ఏసి పులుసెట్టాను.. వేడివేడిగా ఉంది.. పిల్లలందరం కలసి భోంచేద్దాం.. బేగా రా.. అని చెప్పగానే మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.. అంటూ రచ్చబండ నుంచి అందరూ ఇంటికి వెళ్లిపోయారు.

– కై కలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement