నరసాపురం రూరల్: మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పండ్ల రవాణా వాహనం అదుపుతప్పి, అక్కడి మ్యాన్‌హోల్‌ను ఢీకొని నిలిచింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ముదినేపల్లి రూరల్: ఇంటికి వేసిన తాళం పగులగొట్టి, విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు చోరీకి గురైన సంఘటన మండలంలోని కొరగుంటపాలెంలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉమ్మడిశెట్టి సివేంద్ర, సింగరాయపాలెంలోని గ్రోవెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అదే గ్రామంలో ఉంటున్న సివేంద్ర వదిన ఈ నెల 5న హైదరాబాద్ వెళ్తూ, ఇంటిని జాగ్రత్తగా చూస్తుండమని చెప్పింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని స్థానికులు గమనించి సివేంద్రకు సమాచారం అందించారు. వెంటనే సివేంద్ర, వదిన గారి ఇంటి లోపలికి వెళ్లి చూడగా... బీరువా తాళం పగులగొట్టి, అందులోని సామాన్లన్నీ చిందరవందరగా పడవేసి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన హైదరాబాద్‌లో ఉన్న వదినకు ఫోన్ ద్వారా తెలిపారు. బీరువాను పరిశీలించగా 4 కాసుల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సాయిశ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం కొండపైన పాత టోల్‌గేట్ సమీపంలోని పొదల్లో ఓ యాచకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడాన్ని ఆలయ సెక్యూరిటీ గార్డు ఆదివారం గుర్తించాడు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే. ఘటనా స్థలానికి ఉదయం 9.45 గంటల సమయంలో వెళ్లిన సెక్యూరిటీ గార్డుకు ఈ మృతదేహం కనిపించింది. మృతుడిది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన పంతం సత్యనారాయణ(65)గా గుర్తించారు. ఆయన గత 30 ఏళ్లుగా ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాల్లో యాచకుడిగా జీవిస్తున్నాడు. సుమారు వారం రోజుల క్రితమే ఆయన మృతి చెంది ఉండవచ్చని దేవస్థానం సీఎస్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఆదిత్య వర్మ, వీవీఎస్‌ఎం శ్రీనివాస రాజు తెలిపారు. ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో మొత్తం 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జట్టుకు ఎంపికై న వారిలో కె.అభిరామ్, వీర్ కొట్టు, ఐ.మోక్షిత్ వర్మ, సీహెచ్ వైకుంఠ కౌషిక్, కేకేఎస్ కార్తికేయ, టీఎస్‌ఎస్ సాయి మణికంఠ, పీసీహెచ్ నాగ గణేష్, డి.హేమ శరణేష్, పీజీ గౌతమ్, వి.విక్రమ్ నిహాల్ తేజ ఉన్నారు. వీరితో పాటు కె.వెంకట సాయి కృష్ణ, డి.భువన్ రామ్‌వర్మ, జి.పుష్పత్, టి.హను కీర్తన్, ఎస్.భువన్ కార్తీక్, జి.విష్ణువర్ధన్, ఎన్.కార్తీక్ వర్మ, ఏఎన్‌ఎస్.శ్రీరామ్ చౌదరి, కె.సాయి దీపక్, ఆర్.సందేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ జట్టు సభ్యులు వచ్చే నవంబర్ 7 నుంచి 14వ తేదీ వరకు పేరేచర్ల, పిచుకలగుంటల్లో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులు బీఎస్.మంగేష్, బీహెచ్.అవనీష్ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.


