ద్వారకాతిరుమల: వైఎస్సార్‌సీపీ నేతపై దాడి ఘటనలో అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలపై ఫిర్యాదు చేసిన వ్యక్తి.. సొంత మండలానికి చెందిన కానిస్టేబుల్ కావడం చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్న ఆయన, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం వద్ద కూడా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు వెనుక ఉద్దేశాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రతాపనేని శ్రీనివాస్(వాసు)పై దౌర్జన్యం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం వాసుతో పాటు వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, మరికొందరిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ భాస్కరరావు(పీసీ నెంబర్ 2090) స్వస్థలం కూడా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం బీసీ కాలనీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సొంత మండలంలోనే నాలుగేళ్లుగా..
పోలీసు సిబ్బంది విధుల నిర్వహణలో స్థానిక పరిచయాలు, వ్యక్తిగత సంబంధాలు ప్రభావం చూపకుండా ఉండేందుకు బదిలీలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సొంత మండలానికి చెందిన కానిస్టేబుల్ అదే ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ భాస్కరరావు అత్తవారి ఊరు కూడా ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం కావడం, ఇతని ఇరు కుటుంబాల వారూ పూర్తిగా టీడీపీ వీరాభిమానులు కావడంతో ఆ పార్టీ నేతల డైరెక్షన్ మేరకు వైఎస్సార్ సీపీ నేతలపై ఫిర్యాదు చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. తమపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులను వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల విధులు ఎలా కేటాయించారు?
కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సొంత మండలానికి చెందిన సదరు కానిస్టేబుల్ ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వర్తించడంపైనా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన సమయంలో ఆర్వో కార్యాలయం పరిసరాల్లో చోటుచేసుకున్న పరిణామాలను సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పరిశీలించాలని కోరుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరు విధులు నిర్వహించారు? రాజకీయ నాయకుల రాకపోకలు, హడావుడి ఎలా సాగింది? కానిస్టేబుల్ వ్యవహారశైలి ఎలా ఉంది? అనే అంశాలపై స్పష్టత రావాలంటే ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
స్పందించకుంటే ఎస్‌ఈసీని ఆశ్రయిస్తాం
సొంత మండలానికి చెందిన కానిస్టేబుల్ ఫిర్యాదుతో వైఎస్సార్ సీపీ నేతలపై నమోదైన కేసు, ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ స్థానికత, ఆయన విధుల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన సదరు కానిస్టేబుల్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల దాడి
కూటమి కనుసన్నల్లో కానిస్టేబుల్ ఎదురు ఫిర్యాదు
ఆయన టీడీపీ వీరాభిమాని అంటూ ఆరోపణలు
సొంత మండలంలోనే నాలుగేళ్లుగా విధులు
సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి వాస్తవాలు తేల్చాలంటున్న నేతలు


