● ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
● జీలుగుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
బుట్టాయగూడెం: వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జీలుగుమిల్లి మసీదు సెంటర్‌సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ దారుణం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం జోడేబోడిగూడెం గ్రామానికి చెందిన పూనెం సింధూర్ (33) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అదే సమయంలో టి.నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ధారవతు భద్రం (60) జీలుగుమిల్లి మండలంలో పొలం పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వస్తున్నారు. జీలుగుమిల్లి మసీదు సెంటర్ సమీపంలో వచ్చేసరికి ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సింధూర్‌తో పాటు భద్రం తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతుడు పూనెం సింధూర్ బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెంలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


