అటవీశాఖ అధీనంలో నక్షత్రపు తాబేలు | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అధీనంలో నక్షత్రపు తాబేలు

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

అటవీశాఖ అధీనంలో నక్షత్రపు తాబేలు గుబ్బల మంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కాకర్లమూడిలో పిచ్చికుక్క స్వైరవిహారం

కై కలూరు: ప్రపంచంలోనే అరుదైన జాతిగా భావించే నక్షత్రపు తాబేలును కై కలూరు అటవీశాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దీని వయసు సుమారు 9 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. కై కలూరులో ఓ యూట్యూబర్‌కు ఇది ఆరుబయట కనిపించడంతో, ఆయన అటవీశాఖ రేంజర్‌ జి.ఉషారాణికి సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాజేష్‌ ఆ తాబేలును తన ఆధీనంలోకి తీసుకుని, ఆటపాక పక్షుల కేంద్రంలో భద్రపరిచారు. దీనిని సోమవారం విశాఖపట్నం జూ పార్క్‌కు తరలిస్తామని అటవీ సిబ్బంది తెలిపారు. కాగా, కై కలూరు పరిసర ప్రాంతాల్లో మరికొన్ని అరుదైన నక్షత్రపు తాబేళ్లు కొందరి ఇళ్లలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన కామవరంలో వెలిసిన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వాహనాల్లో ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, అలాగే విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక వీధికుక్క విచక్షణా రహితంగా దాడి చేసి 11 మందిని తీవ్రంగా గాయపరిచింది. వీధిలో వెళ్తున్న వారిపై ఒక్కసారిగా పడి వరుసగా అందరినీ కరవడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. గాయపడిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. బాధితుల్లో కొందరికి కాళ్లు, చేతుల కండలు తెగిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో మోటుపల్లి జ్యోతి, దంగేడి సీతామహాలక్ష్మి తదితరులు ఉన్నారు. గ్రామంలో వరుసగా అందరిపైనా దాడి చేస్తుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఆ కుక్కను కర్రలతో కొట్టి హతమార్చారు. గ్రామాల్లో పెరిగిపోతున్న వీధికుక్కల బెడదపై పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement