కమలానికి సీటు..సైకిల్‌కిచోటు | - | Sakshi
Sakshi News home page

కమలానికి సీటు..సైకిల్‌కిచోటు

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

ద్వారకాతిరుమల: పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీకి స్థానిక అభ్యర్థి కరువయ్యారు. దీంతో టీడీపీ నుంచి ఒక నేతను పార్టీలోకి ఆహ్వానించి, కమలం గుర్తుపై బరిలోకి దింపేందుకు కూటమి నాయకులు నిర్ణయించారు. ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్‌. రాఘవాపురంలో ఈ ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.పొత్తులో భాగంగా ద్వారకాతిరుమల మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలతో పాటు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ నేతలు తొలుత కోరారు. అయితే అన్ని స్థానాలు కేటాయించడం సాధ్యం కాదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేయడంతో, కనీసం మూడు ఎంపీటీసీ స్థానాలైనా ఇవ్వాలని కోరారు. చివరకు ద్వారకాతిరుమల మండలంలో ఐ.ఎస్‌. రాఘవాపురం స్థానానికే పరిమితమయ్యారు. గోపాలపురం మండలంలోని చిట్యాల, దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు, నల్లజర్ల మండలంలోని అనంతపల్లి ఎంపీటీసీ స్థానాలను కూడా బీజేపీకి కేటాయించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఐ.ఎస్‌. రాఘవాపురంలో సీటు దక్కినా, సొంత పార్టీ అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ నేతను బరిలోకి దించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కూటమిలో రెబల్స్‌ బెడద

మరోవైపు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినప్పటికీ, రెబల్స్‌ నామినేషన్లు కూటమికి తలనొప్పిగా మారాయి. దొరసానిపాడులో టీడీపీ అధికారిక అభ్యర్థికి పోటీగా అదే పార్టీకి చెందిన మరో నాయకుడు శుక్రవారం రెబల్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే పి.కన్నాపురం, గుణ్ణంపల్లిలోనూ టీడీపీ అభ్యర్థులకు పోటీగా జనసేనకు చెందిన రెబల్స్‌ నామినేషన్లు వేశారు. మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నెల 27న జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో రెబల్స్‌ భవితవ్యం తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement