భీమవరం (ప్రకాశంచౌక్): మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు 62 ఏళ్ల వయసులో న్యూఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన ఇందుకూరి విజయలక్ష్మిని కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. నషా ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా విజయలక్ష్మి అక్టోబర్ 22న భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి తన యాత్రను ప్రారంభించారు. భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో కళాశాలలను సందర్శించి లక్ష మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ యాత్ర డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ముగియనుంది. శుక్రవారం కలెక్టర్‌ను కలిసిన విజయలక్ష్మి, యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఆమె చేపట్టిన ఈ యాత్ర స్ఫూర్తిదాయకమని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
టి.నరసాపురం: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన రగ్బీ, కబడ్డీ పోటీల్లో ఏలూరు జిల్లా టి.నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయుడు బి. లింగస్వామి శుక్రవారం తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో అన్నమయ్య జిల్లాలో జరిగిన 70వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో బొమ్మగాని సాయి పండు, మారుమూడి వరుణ్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అలాగే కాకినాడలో జరిగిన అండర్–17 విభాగం రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ఎస్.కె. నసీమా, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూజివీడులో జరిగిన 36వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఆర్.నాగరాణి అద్భుత ప్రతిభ చాటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు, శిక్షణ అందించిన పీఈటీ అడపా రామకృష్ణను ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం లంకలకలవగుంటలో దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి నిర్వహించిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు తదితర జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. శుక్రవారం వేకువజామున జరిగిన ఫైనల్స్‌లో చినగంజాం, నెల్లూరు జట్లు తలపడగా.. చినగంజాం జట్టు విజయం సాధించింది. నెల్లూరు రెండో స్థానంలో, స్టూవర్టుపురం మూడో స్థానంలో, ఏలూరు జిల్లా వేమవరప్పాడు జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
కొయ్యలగూడెం: గ్రామంలోని కొవ్వూరు రోడ్డులో ఉన్న జయప్రద హాస్పిటల్ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెంలో కమ్మరి వృత్తి చేసుకునే ఈదరాడ కనక సుందరం (48) అనే వ్యక్తి ముప్పిడి వెంకటేష్ అనే రిక్షా పుల్లర్ రిక్షాలో కొయ్యలగూడెం సెంటర్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనక సుందరం తలకు తీవ్ర గాయమవ్వగా, రిక్షా పుల్లర్ వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కనక సుందరం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బాల హరిచంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


