దర్యాప్తు ముమ్మరం
ఉంగుటూరు: మండలంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన వెలుగు చూసింది. ఉంగుటూరు రెవెన్యూ అటవీ ప్రాంతంలో 35 నుంచి 40 సంవత్సరాల వయసున్న ఓ మహిళను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల ప్రకారం మండలంలోని నాచుగుంట పంచాయతీ పరిధిలోని ఉంగుటూరు రెవెన్యూ ఫారెస్ట్ బి బ్లాక్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆర్టికల్చరల్ యూనివర్సిటీ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించి చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సూర్యభగవాన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గణపవరం సీఐ రజనీకుమార్ పరిస్థితిని సమీక్షించారు. అటవీ బీట్ ఆఫీసర్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలు సంధ్యగా గుర్తింపు?
దుండగులు కాల్చివేసిన మహిళ మృతదేహం ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన సంజయ సంధ్యదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సంధ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు రావులపర్రు నుంచి తన కుమారుడి మోటార్‌సైకిల్‌పై ఉంగుటూరు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె తాడేపల్లిగూడెం వైపు వెళ్లినట్లు సమాచారం. ఆమె భర్త శివప్రసాద్ రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటల తర్వాత ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉంగుటూరు అటవీ ప్రాంతంలో మహిళను హత్య చేసి కాల్చివేశారన్న సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన ఆనవాళ్ల ఆధారంగా ఆ మృతదేహం సంధ్యదేనని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.
మహిళ మృతదేహం నడుము భాగం మినహా మిగతా శరీరం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. దుండగులు ఇక్కడే హత్య చేసి దహనం చేశారా? లేక వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని, లేదా కావాలనే పథకం ప్రకారం వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి రప్పించి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ అటవీ ప్రాంతం జనసంచారం లేకుండా నిశ్శబ్దంగా ఉండటంతో కొందరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వపరంగా భద్రతా చర్యలు కరవయ్యాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలు, క్లూస్ టీమ్స్ సేకరించిన నమూనాల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.


