నూజివీడు: మండల కేంద్రమైన ముసునూరులోని ముసునూరు–2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కంభంపాటి సునీత వేసిన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్‌ను తిరస్కరించేందుకు రిటర్నింగ్ అధికారి ఎం.పి.ఎన్. సుందరి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో సునీతకు ఓటు హక్కు ఉన్నప్పటికీ.. గ్రామ పంచాయతీ ఓటర్ల తొలగింపు జాబితాలో ఆమె పేరు ఉందనే కారణంతోనే నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచానని ప్రశ్నించిన నాయకులకు ఆర్వో సుందరి సమాధానమిచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిందా? అని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ఆర్వో స్పష్టం చేశారు.
కలెక్టర్ చెప్పారంటున్న ఆర్‌ఓ
ఎన్నికల సంఘం ఉత్తర్వులు లేనప్పుడు నామినేషన్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచుతారని నాయకులు నిలదీయగా.. జిల్లా కలెక్టర్ మౌఖికంగా ఆదేశించారని ఆర్‌ఓ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రాతపూర్వక నిబంధనలకే విలువ ఉంటుందని, మౌఖిక ఆదేశాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని వారు ప్రశ్నించారు. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలో పేరు స్పష్టంగా ఉన్నప్పుడు, పంచాయతీ ఓటర్ల జాబితాతో ముడిపెట్టి అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని మండిపడ్డారు. కొన్ని చోట్ల రెండు పంచాయతీలు కలిసి ఒక ఎంపీటీసీగా ఉంటాయని, అలాంటప్పుడు పంచాయతీ ఓటర్ల జాబితాను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారని నిలదీశారు. రిటర్నింగ్ అధికారి వైఖరిపై కోర్టును ఆశ్రయించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.


