● సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహారం
● ఆకట్టుకున్న శకటాసుర వధ అలంకారం
● నేడు స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకాతిరుమల: ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నతిరుపతిలో శ్రీవారు శుక్రవారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం పంచాయుధధారిగా, నారాయణమూర్తి అలంకరణలో సర్వాలంకార భూషితుడైన శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విరాజిల్లారు. విశేష పుష్పాలంకరణలో దేదీప్యమానంగా వెలుగొందిన స్వామివారికి అర్చకులు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ సేవలో స్వామివారిని దర్శించుకుంటే విద్య, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు.
చంద్రప్రభపై చల్లని వెన్నెల వెలుగుల్లో
రాత్రి ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. వెన్నెల వెలుగులను తలపించే ఈ వాహనంపై స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను పరవశింపజేసింది. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన గ్రామోత్సవంలో గజ, అశ్వ సేవలు ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయి. చల్లని చిరుగాలుల మధ్య స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. మరోవైపు, శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆకట్టుకున్న శకటాసుర వధ అలంకారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన శకటాసుర వధ అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బాలకృష్ణుడు బండి రూపంలో వచ్చిన శకటాసురుడిని తన పాదంతో తన్ని సంహరించిన ఘట్టానికి ఇది ప్రతీక. దుష్టశక్తులపై దైవశక్తి విజయాన్ని, శిష్టరక్షణ.. దుష్టశిక్షణ తత్వాన్ని ఈ అలంకారం చాటిచెప్పింది.
నేటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
ఉదయం 7:00 గంటలకు : హనుమద్వాహనంపై గ్రామోత్సవం
రాత్రి 7:00 గంటలకు : ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహన సేవ
ప్రత్యేక అలంకారం : శ్రీరామ పాదుకా సమేత భరతుడు


