పశ్చిమ.. పుర ప్రగతి మమ | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ.. పుర ప్రగతి మమ

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

పశ్చిమ.. పుర ప్రగతి మమ

గత ప్రభుత్వంలో పక్కాగా అభివృద్ధి పనులు

భీమవరం (ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. మొదటి ఏడాదిన్నర పాటు ఇసుక కొరత, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కూడా పనులు చేపట్టలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే నెపంతో, గత ఐదు నెలలుగా నామమాత్రపు పనులు చేసి అవే అభివృద్ధి పనులంటూ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అధ్వాన స్థితిలో మునిసిపాలిటీలు

జిల్లాలోని ఆకివీడు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రెయినేజీలు పూర్తిగా క్షీణించాయి. వీధుల్లో రోడ్లన్నీ గోతులమయంగా మారగా, పూడికతీత లేక డ్రెయిన్లు నిండిపోయాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లు ముంపునకు గురవుతుండటంతో పారిశుద్ధ్యం మరింత దిగజారిపోతోంది. ఆయా పట్టణాల్లో మురుగునీరు సాఫీగా పారక, రోజుల తరబడి నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డు గోతుల్లో వర్షపు నీరు చేరి ప్రయాణాలు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ లోపించడం వల్ల చెత్త సమస్య విపరీతంగా పెరిగింది. ఫలితంగా పట్టణ ప్రజలు దోమల కాటుకు గురై రోగాలపాలవుతున్నారు. కొన్ని పట్టణాల్లో కనీస దోమల నివారణ చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం.

నిధుల మళ్లింపుతో పనులు శూన్యం

జిల్లాలోని ఆరు పట్టణాల్లో సాధారణ నిధులు, కొన్ని మున్సిపాలిటీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో పట్టణాభివృద్ధికి అవకాశం లేకుండా పోతుంది. దీంతో పట్టణంలోని, మౌలిక వసతుల కల్పనకు సైతం నిదులు ఖర్చు చేసే అవకాశం లేక అధికారులు మౌనం వహిస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తు ప్రణాళికలతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు, సిల్ట్‌ తొలగింపు చర్యలు సైతం చేపట్టలేదు. అక్కడక్కడా తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు.

డంపింగ్‌ యార్డులు, తాగునీటి సమస్యలు

జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, ఆకివీడు మున్సిపాలిటీల్లో డంపింగ్‌ యార్డుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పట్టణాల చివరి ప్రాంతాలకు మంచినీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇక పట్టణాల్లోని జగనన్న కాలనీల్లో అయితే కనీస వసతులు కూడా లేక నివాసితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

నెరవేరని పవన్‌ కల్యాణ్‌ హామీ

భీమవరంలో డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీ రెండేళ్లు దాటినా నేటికీ నెరవేరలేదు. భీమవరం పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకొల్లులో రెండు డంపింగ్‌ యార్డులు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో ఒకదాని సమస్యను 90 శాతం మేర రీసైక్లింగ్‌ విధానంలో పరిష్కరించారు. రెండో డంపింగ్‌ యార్డు సమస్యపై దృష్టి పెట్టేలోపే ప్రభుత్వం మారడంతో ఆ సమస్య అలాగే నిలిచిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో చెత్త సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

నిలదీయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు

పట్టణ ప్రజల సమస్యలు తీర్చకుండా, అభివృద్ధి పనులు చేయకుండా ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కూటమి ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రెయినేజీల సమస్యలపై నేరుగా ప్రశ్నించనున్నారు. గతంలో మాదిరిగా ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేసే కూటమి నాయకుల బెదిరింపులకు నేడు ప్రజలు భయపడే స్థితిలో లేరు. సోషల్‌ మీడియా వేదికగా సమస్యలపై గళం విప్పడం, కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాది నుంచే జిల్లాలోని ఆరు పట్టణాల్లో క్రమం తప్పకుండా అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు, డ్రెయినేజీలు, భవనాల నిర్మాణాలు ముమ్మరంగా సాగాయి. ఆయా పట్టణాల్లో మొదటి రెండేళ్లలోనే రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. భీమవరంలో రూ.80 కోట్లు, తణుకులో రూ.60 కోట్లు, తాడేపల్లిగూడెంలో రూ.60 కోట్లు, పాలకొల్లులో రూ.40 కోట్లు, నర్సాపురంలో రూ.30 కోట్లు, ఆకివీడులో రూ.30 కోట్ల చొప్పున నిధులు వెచ్చించి పనులు చేశారు. అలాగే జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లు, భీమవరంలో ప్రభుత్వ ఆస్పత్రులను 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. భీమవరంలో 100 పడకల ఆస్పతికి దాదాపు రూ 38 కోట్లుతో నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణంలో మూడు అర్బన్‌ పీహెచ్‌సీలకు పక్కా భవనాలు నిర్మాణం చేశారు. మూడు హెడ్‌ వాటర్‌ ట్యాంకులు నిర్మించారు. నరసాపురం, పాలకొల్లు 100 పడకల ఆస్పత్రిగా సేవలు అందిస్తున్నాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర పనులు కూడా చేయలేకపోయింది.

కూటమి ప్రభుత్వంలో పట్టణాల్లో అభివృద్ధి నిల్‌

మునిసిపాలిటీల్లో అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు

శివారు ప్రాంతాల్లో వేధిస్తున్న తాగునీటి సమస్య

ఓట్లు అడగడానికి వచ్చే కూటమి నేతలను నిలదీసేందుకు ప్రజలు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement