బ్రహ్మోత్సవాల్లో నేడు
● శ్రీవారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ వేడుక
● హంస వాహనంపై తిరువీధుల్లో స్వామివారి విహారం
ద్వారకాతిరుమల: చరాచర సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ.. శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి ధ్వజారోహణ వేడుకను వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి జరిపిన ఈ వేడుక భక్తజనకోటికి కనువిందు చేసింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఇంద్రాది అష్టదిక్పాలకులు, దేవగణాలు, సప్త అధోలోక జీవులను ఆహ్వానిస్తూ ఈ వేడుకను జరిపారు. ఉదయం ఆలయంలో నిత్యహోమాలు, బలిహరణలు, వేదస్వస్తి.. సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాత్రి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ ముఖమండపంలో స్వామివారి కాళీయమర్దనం అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
శాస్త్రోక్తంగా అంకురార్పణ
తొలుత విష్వక్సేనుడిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అనంతరం అర్చకులు పుట్టమన్నును తెచ్చి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాలికల్లో ఉంచి, వేదమంత్రాల నడుమ నవధాన్యాలను వాటిలో పోశారు. ఆపై సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ నిర్వహించారు. ఈ సందర్భంగా పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరించారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం.
ఉదయం 7 గంటలకు – సూర్యప్రభ వాహన సేవ
రాత్రి 7 గంటలకు – చంద్రప్రభ వాహన సేవ
ప్రత్యేక అలంకారం : శకటాసుర వధ


