నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి సరిహద్దు చెక్‌పోస్ట్‌లో తనిఖీలు బైక్‌ ఢీకొని మహిళ మృతి

బుట్టాయగూడెం: నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (జేడీఏ) ఎస్‌కే మహబూబ్‌ బాషా విత్తన డీలర్లకు సూచించారు. గురువారం బుట్టాయగూడెం మండలంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న సీడ్‌ ప్రొడక్షన్‌ వేస్తున్న రైతులు తప్పనిసరిగా కంపెనీ అగ్రిమెంట్‌ పేపర్లు పొందాలని స్పష్టం చేశారు. రాబోయే రబీ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఎరువుల కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొలుత ఆయన రాజానగరం గ్రామంలోని వరి పొలాలను పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి ఎంఆర్‌పీ ప్రియాంక, ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జులు, రైతులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద గల ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. జీలుగుమిల్లి ఎస్సై వి. క్రాంతి కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా మద్యం సీసాలు తరలించకుండా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా అనుమతి లేని నగదు రవాణా చేయకుండా ఉండేందుకు చెక్‌పోస్ట్‌ వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు మీదుగా రాకపోకలు సాగిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర రవాణా వాహనాల డిక్కీలను, అనుమానాస్పద సామాగ్రిని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అత్తిలి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ పి. శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. తణుకు రోడ్డులోని వైన్‌షాప్‌ ఎదురుగా ఉన్న నివాస గృహం నుంచి, రోడ్డు అవతలి వైపునకు దాటుతున్న వెలగల సత్యవతి (56)ని అత్తిలి నుంచి తణుకు వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెచ్‌సీ శ్రీనివాస్‌ వెల్లడించారు.

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

తాడేపల్లిగూడెం రూరల్‌: జగన్నాధపురంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడల నాగేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన బాలం రాజేష్‌ మధ్య కొంతకాలంగా వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రాజేష్‌, నాగేశ్వరరావు ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఆయనపై దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ప్రాణాలు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడు సాయంత్రం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement