ఏలూరు టౌన్: ఏలూరులో ప్రజలకు అత్యంత ముఖ్యమైన స్వచ్ఛమైన తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యమిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల వింగ్ మీడియా సమావేశ ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని 62 డివిజన్లలో తమ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారని, మేయర్‌గా గంటా మోహనరావు (జీఎంఆర్)విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు అవినీతి గ్రహణం వీడాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జీఎంఆర్ విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో చూశామని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదన్నారు. ఇదేనా ఎన్నికల హామీలను అమలు చేయడం అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిజాయితీ గల నేత జీఎంఆర్ : ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీ గల నాయకుడు గంటా మోహనరావును మేయర్‌గా గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే నగర ప్రజలకు సుపరిపాలన అందిస్తారన్నారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఏలూరు నగరపాలక సంస్థపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలని కోరారు. చేస్తారు.
సమస్యల పరిష్కారానికి కృషి
మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు మాట్లాడుతూ నగరంలో ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమం ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన మరోవైపు ప్రాధ్యాన్యత ఇస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా పరిశుభ్రమైన తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు ఇలా ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు మంచి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అవినీతిరహిత పాలనే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు


