చెక్కులతో సెట్‌ చేద్దాం! | - | Sakshi
Sakshi News home page

చెక్కులతో సెట్‌ చేద్దాం!

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

పొలిటికల్‌ కనుసన్నల్లోనే..

సాక్షి ప్రతినిధి, ఏలూరు: తొందరగా నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం ముగిద్దాం.. బడాబాబు రూ.70 లక్షలు వాడుకున్నారు.. ఆయన కొద్దిరోజుల్లో కట్టేస్తాడు.. మొత్తం ఐదుగురు ఉద్యోగులను పాత్రధారులుగా తేల్చి రూ.1.34 కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్టు గుర్తించారు.. అనవరంగా దీనిని ఎక్కువ రోజులు సాగదీస్తే గతేడాది, అంతకు ముందు సంవత్సరాలది కూడా తవ్వి బయటకు తీస్తారు.. రూ.2.50 కోట్లకుపైనే పాతవి తేలే ప్రమాదం ఉంటుంది. అందుకని ఐదుగురు ఉద్యోగులు తలా రూ.27.50 లక్షల చొప్పున జనవరి నెల పోస్ట్‌ పెయిడెడ్‌ చెక్కులు ఇచ్చేయండి.. నగదు రికవరీ చేశామని ఫైల్‌ క్లోజ్‌ చేసేద్దాం.. ఇది ఏలూరు నగరపాలక సంస్థ ఉన్నతాధికారి సస్పెండ్‌కు గురైన ఉద్యోగులకు పెట్టిన ప్రతిపాదన.

తిరగబడ్డ ఉద్యోగి

మొత్తం ఈ వ్యవహారంలో నగరపాలక సంస్థ అకౌంటెంట్‌ లింగేశ్వరి, మేనేజర్‌ మూర్తి, షరాఫ్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ రవి, అటెండర్‌ మోహనకృష్ణలపై సస్పెండ్‌ వేటు పడింది. ఈ క్రమంలో ఐదుగురు సిబ్బందితో ఉన్నతాధికారి తలా రూ.27.50 లక్షల మొత్తంతో వచ్చే ఏడాది జనవరి (పోస్టు పెయిడెడ్‌) చెక్కులు ఇస్తే రికవరీ చేశామని, అవకతవకలను సరిదిద్దామని చార్జీ మెమోలతో వ్యవహారాన్ని ముగించేయవచ్చని చెప్పగా ఒక ఉద్యోగి తిరగబడ్డాడు. ‘మాకు ఎలాంటి సంబంధం లేదు.. మేం వాడుకున్నది లేదు.. అన్నీ మీకు తెలుసు.. పెద్దవాళ్లు ఏం చేశారో కార్పొరేషన్‌ అంతా తెలుసు.. నన్ను వేధిస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా’ అని హెచ్చరించడంతో సెటిల్‌మెంట్‌ అర్ధాంతరంగా ముగిసి పొలిటికల్‌ నేతల వద్దకు చేరినట్టు సమాచారం.

ఏలూరు నగరపాలక సంస్థలో ప్రజాధనం పక్కదారి పట్టింది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు ఇలా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను పొలిటికల్‌ కనుసన్నల్లో కొందరు స్వాహా చేశారు. రాజకీయ నేతలు 70 శాతం తింటే ఉద్యోగులు మరో 30 శాతం తినేశారు. ఎంతైనా వాడుకుని డబ్బులు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తే సరిపోతుందనుకున్నారు. అయితే వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.96.36 లక్షలు, అంతకు ముందు ఏప్రిల్‌లో రూ.38 లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారించారు. నూజివీడు, తణుకు నుంచి ఇద్దరు అకౌంటెంట్లు, మున్సిపల్‌ ఆర్‌డీలు నగరపాలక సంస్థలో విచారణ నిర్వహించి రికార్డులు పరిశీలించగా ఒక్కొక్కటిగా వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తిగా పొలిటికల్‌ కనుసన్నల్లో జరిగిన దందా కావడంతో ఉద్యోగులు నిన్నమొన్నటి వరకు ధీమాగా వ్యవహరించారు. సస్పెన్షన్‌కు గురికావడం, శాఖాపరమైన విచారణతో పాటు పోలీస్‌ విచారణ కూడా ప్రారంభం కావడంతో తీవ్ర అలజడి రేగింది. నగరపాలక సంస్థ ఉన్నతాధికారి పొలిటికల్‌ సూచనలతో నిధుల గోల్‌మాల్‌ ఫైల్‌ను మూసివేసే దిశగా అడుగులు వేశారు. బడాబాబు రూ.70 లక్షలు వాడుకున్నారని కొద్ది నెలల్లోనే చెల్లిస్తారని, మిగతా మొత్తం మనమే సర్దుబాటు చేయాలని సస్పెండ్‌ అయిన ఉద్యోగులకు క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది.

రూ.1.34 కోట్లు గోల్‌మాల్‌గా గుర్తింపు

ఐదుగురు ఉద్యోగులు తలా రూ.27.50 లక్షలు కట్టండి

పోస్ట్‌ పెయిడెడ్‌ చెక్కులతో వ్యవహారం ముగిద్దాం

రూ.70 లక్షలు బడా బాబు వాటాగా నిర్ధారణ

తిరగబడ్డ కీలక ఉద్యోగులు

సెటిల్‌మెంట్‌ దిశగా ఏలూరు కార్పొరేషన్‌ నిధుల గోల్‌మాల్‌

ఫొటో: ఏఐ సృష్టించిన చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement