పోలవరం రూరల్: గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు తగ్గుతుండటంతో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 33 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 9.02 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దిగువన కొంత వరద ప్రవాహం ఉన్నా భద్రాచలం వద్ద 38.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భద్రాచలం నుంచి దిగువకు 7.36 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకు మాత్రలు వేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ అన్నారు. సోమవారం నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. నులిపురుగుల వల్ల కలిగే అనర్థాలు, నివారణ చర్యలను వివరించారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాలు సమన్వయంతో నూరు శాతం పిల్లలకు మాత్రలు వేయాలన్నారు. మాత్రలు వేసుకోని పిల్లలకు వచ్చేనెల 6న అందించాలన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ కె.లక్ష్మీనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పుల్లయ్య, ఐసీడీఎస్ పీడీ పి.శారద, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రామ్ అధికారి నరేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: జిల్లాలో ప్రజల సమస్యలను అత్యంత పారదర్శకంగా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 43 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్టం మేరకు నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు. ప్రజలు మీ కోసం పోర్టల్‌లో తమ ఫిర్యాదులు నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల పురోగతిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రామాల్లో మౌలిక వసలుల కల్పన, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో మంగళవారం నుంచి వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, రహదారి సౌకర్యం లేని ఆవాసాలకు కనెక్టివిటీ కల్పించే పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పనుల్లో నాణ్యత తప్పక పాటించాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా ఎరువులు, పురుగుమందులు, వరి విత్తనాలు, సూపర్ బజార్ ద్వారా నిత్యావసర సరకులు, జనరిక్ మందులు, దీపావళి బాణసంచా విక్రయాలు మొత్తంగా రూ.113.53 కోట్లు జరిగాయని, రూ.2.52 కోట్లు నికరలాభం ఆర్జించామని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక డీసీఎంఎస్ సమావేశ మందరింలో మురళీకృష్ణ అధ్యక్షతన ఉమ్మడి సొసైటీ మహాజన సభ నిర్వహించారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ డీసీఎంఎస్, డీసీసీబీలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. జిల్లాలో సుమారు 6,7 బ్రాంచీలు నష్టాలో ఉ న్నాయన్నారు. జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, డీసీసీబీ సీఈవో సింహచలం, పీఏసీ పర్సన్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


