గిరిజన నిర్వాసితుల్లో గుబులు | - | Sakshi
Sakshi News home page

గిరిజన నిర్వాసితుల్లో గుబులు

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

స్థానికులకే ఇవ్వాలి

వేరే వారికి ఇవ్వొద్దు

కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కారణంగా ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితుల కోసం కుక్కునూరు మండలంలోని పుల్లప్పగూడెంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల వద్ద పిచ్చిమొక్కల తొలగింపు, శుభ్రపరిచే పనులు చేపట్టడంపై స్థానిక గిరిజనుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ కోసం నిర్మించిన ఇళ్లను ఇతర ప్రాంతాల నిర్వాసితులకు కేటాయించేందుకే ఈ పనులు చేపడుతున్నారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాలెన్నో..

ప్రభుత్వం మండలంలోని గిరిజన నిర్వాసితుల కోసం కివ్వాక, మర్రిపాడు, పుల్లప్పగూడెం, వెంకటాపురం, నెమలిపేట గ్రామాల సమీపంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం మొదటి విడతగా 41.15 కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం జమ చేసిన ప్రభుత్వం, వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేసింది. అలాగే పోలవరం మండలంలోని నిర్వాసితులకు కుక్కునూరు మండలంలో ’భూమికి భూమి’ కింద పరిహారం అందించి పునరావాస కాలనీలు నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే కుక్కునూరు మండలంలోని గిరిజన గ్రామాలు 45 కాంటూర్‌ పరిధిలో ఉండటం, పుల్లప్పగూడెం కాలనీ వద్ద ఇప్పుడు హడావుడిగా శుభ్రతా పనులు చేపట్టడంతో స్థానిక గిరిజనుల్లో అనుమానాలు మొదలయ్యాయి. 41 కాంటూర్‌ పరిధిలో ఉన్న పోలవరం జిల్లా నిర్వాసితులకు ఈ ఇళ్లను కేటాయించేందుకే శుభ్రం చేస్తున్నారేమోనని వారు భయపడుతున్నారు.

దగ్గరుండి నిర్మాణం చేయించుకున్న గిరిజనులు

కాలనీల నిర్మాణ సమయంలో ఇళ్ల నాణ్యతపై అప్పట్లో పెద్దఎత్తున అభ్యంతరాలు రావడంతో, అధికారులు గిరిజనులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే నిర్మాణ పనులను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఏ ఇల్లు ఎవరికి కేటాయించేదీ ముందే నిర్ణయించారని గిరిజనులు చెబుతున్నారు. దీంతో కొంతమంది నిర్వాసితులు తమ సొంత ఖర్చులతో ఆ ఇళ్లలో అల్మరాలు తదితర వసతులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లను వేరే ప్రాంత నిర్వాసితులకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌

ఈ కాలనీలను ఎవరికి కేటాయించనున్నారనే అంశంపై అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని స్థానిక గిరిజన నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ కోసం నిర్మించిన ఇళ్లను తమకే కేటాయించి, ఇప్పటికే నిర్ణయించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై కుక్కునూరు తహసీల్దార్‌ చలపతిరావును వివరణ కోరగా కాలనీల్లో ఇళ్లను ఎవరికి కేటాయించాలనేది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. ప్రస్తుతం ఆ ఇళ్లను పోలవరం జిల్లా ప్రాంత నిర్వాసితులకు కేటాయిస్తున్నారనే సమాచారం తమ వద్ద లేదని ఆయన పేర్కొన్నారు.

మండలంలో నిర్మించిన పునరావాస కాలనీని గతంలో ప్రభుత్వం ఇక్కడి వారి కోసమే అని చెప్పింది. అందుకోసం కమిటీలు కూడా వేశారు. దీంతో దగ్గరుండి నాణ్యతతో నిర్మాణం చేయించుకున్నాం. ఈ ఇళ్లను స్థానికులకే ప్రభుత్వం అప్పగించాలి – సరియం ప్రసాద్‌, రెడ్డిగూడెం, కుక్కునూరు మండలం

మా కోసం నిర్మించిన పునరావాస కాలనీలు ఒకవేళ పోలవరం జిల్లా నిర్వాసితులకు ఇవ్వాలనుకుంటే వారికి స్థానికంగా నిర్మాణం చేపట్టండి. అంతేకానీ మా కోసం అని చెప్పిన వాటిని వారికి మాత్రం కేటాయించవద్దు.

– తురసం వసంతరావు, ఆంబోతులగూడెం, కుక్కునూరు మండలం

పుల్లప్పగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వేరే వారికి కేటాయిస్తారనే అనుమానం

కాలనీ వద్ద పారిశుధ్య పనులతో ఆందోళన

స్పష్టత ఇవ్వాలని గిరిజనుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement