పాలకొల్లు సెంట్రల్: స్థానిక శంభునిపేట 11వ వార్డులోని అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ జరిగినట్లు నిర్వాహకురాలు జి. కుమారి తెలిపారు. శుక్రవారం రాత్రి అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టిన దుండగులు.. గ్యాస్ సిలిండర్, ఆయిల్ ప్యాకెట్లతోపాటు మరికొన్ని వస్తువులను దొంగిలించినట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇలాగే గ్యాస్ సిలిండర్లు చోరీకి గురైన సంఘటనలు ఉన్నాయని కుమారి తెలిపారు.
ఉండి: ఉండిలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆర్వోబీ నిర్మాణ పనుల్లో భాగంగా భారీ యంత్రాలతో పనులు చేపట్టాల్సి ఉన్నందున, ఆ సమయంలో వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతోనే గేటు మూసివేస్తున్నట్లు వారు వెల్లడించారు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి సహకరించాలని అధికారులు కోరారు.
కుక్కునూరు: ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంతో భూసారాన్ని పరిరక్షించడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యతను పెంచుకోవచ్చని ఏలూరు ఐఎఫ్‌ఎఫ్‌సీఓ జిల్లా అధికారి దిలీప్‌కుమార్ తెలిపారు. కుక్కునూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ప్రొప్రైటర్ వేల్పుల వెంకన్నబాబు ఆధ్వర్యంలో శనివారం రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు కేవలం రసాయనిక ఎరువులపైనే ఆధారపడకుండా.. నానో ఎరువులు, జీవ ఎరువులు, సాగరిక, బోరాన్, నేచురల్ పొటాష్ వంటి ప్రత్యామ్నాయ ఎరువులను వాడాలని సూచించారు. వీటి వినియోగ పద్ధతులు, వాటి ద్వారా పంటలకు కలిగే మేలును వివరించారు. భూసార పరిరక్షణతోనే స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు పాల్గొన్నారు.
భీమవరం: వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భీమవరం ఆర్డీవో కె. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం భీమవరం త్యాగరాజ భవనంలో ఉత్సవ నిర్వాహకుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో, భక్తి పారవశ్యంతో నిర్వహించాలని, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. మండపాల వద్ద, నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలను వినియోగించవద్దని స్పష్టం చేశారు. బాణసంచా కాల్పులు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు ఎ. రమేష్, పి. మురళీకృష్ణ, భీమవరం తహసీల్దార్ ఆర్. రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పోలవరపు వెంకటలక్ష్మి (40) కనిపించడం లేదంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి తన అత్త సీతమ్మతో గొడవ పడుతుండగా, ఆమె కుమారుడు మోహన్ ఇద్దరినీ మందలించాడు. దీంతో కోపంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్సై తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


