భక్తితో పాటు బాధ్యత
కై కలూరు: భక్తి అంటే కేవలం ఆడంబరమే కాదు.. భావితరాలకు ప్రాణవాయువును అందించే బాధ్యత అని నిరూపిస్తున్నారు కై కలూరు ప్రకృతి గణేశా ఉత్సవ కమిటీ సభ్యులు. రైల్వేస్టేషన్ రోడ్డులోని టీటీడీ కల్యాణమండపం ఎదురుగా ఏకంగా 10 వేల మట్టి విగ్రహాలను ఒకే వేదికపై కొలువుతీరుస్తున్నారు. ఇప్పటికే 5 వేల విగ్రహాలను గంగానది మట్టితో చేయించి కోల్‌కతా నుంచి తీసుకురాగా, మరో 5 వేల విగ్రహాలను స్థానిక మట్టితో తయారు చేయిస్తున్నారు. 9 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అన్నసమారాధన రోజు భక్తులందరికీ వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ప్రతి విగ్రహంలోనూ సీడ్ బాల్స్
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి మట్టి విగ్రహంలోనూ సీడ్ బాల్స్ (విత్తనాలు) ఉంచుతున్నారు. ఈ నెల 25న జరిగే భారీ అన్నసమారాధనకు వచ్చిన ప్రజలు ఈ విగ్రహాలను తమ ఇళ్ల వద్దే కుండీల్లో లేదా పెరట్లో నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి కరిగిపోగానే అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే ముప్పును నివారించడానికి యువకులు చేస్తున్న ఈ ప్రయోగాన్ని అందరూ అభినందిస్తున్నారు.
యువత ఆలోచనకు రెక్కలు..
కై కలూరుకు చెందిన మర్రాపు జగదీష్ యూట్యూబర్‌గా దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ, వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవడం గమనించారు. చెట్లను పెంచడానికి మట్టి విగ్రహాల ద్వారానే మొక్కలను అందించాలని భావించి, 28 మంది స్నేహితులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో శివలింగం, వినాయకుడు, కలశం, లడ్డూల రూపంలో విగ్రహాలను సిద్ధం చేశారు. వీటిలో కొన్నింటిని ఈ నెల 22న వేలంపాట వేయనున్నారు.
కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 14న వినాయక చవితి నుంచి 25వ తేదీ వరకు దంపతులతో లక్ష్మీగణపతి హోమం, పంచామృత అభిషేకాలు, విద్యుత్ దీపాలు ఆర్పి ప్రత్యేక గంగాహారతి నిర్వహించనున్నారు. అలాగే కూచిపూడి, జానపద నృత్యాలు, మ్యాజిక్ షో, కోలాట ప్రదర్శన, ప్రవచనాలు చేపట్టనున్నారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ అందరినీ ఆకట్టుకుంటోంది.
కై కలూరులో 10,000 మట్టి వినాయకులు సిద్ధం
9 రోజుల పూజలు.. పదివేల పచ్చని మొలకలు
ఉచిత విగ్రహాల పంపిణీగిన్నిస్‌బుక్ రికార్డులలో చేరదగిన అంశం
భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను గుర్తుచేయడానికి వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టాను. కోల్‌కత నుంచి ఇప్పటికే 5 వేల విగ్రహాలు వచ్చాయి. మరో 5 వేల విగ్రహాలను స్థానికులతో తయారు చేయిస్తున్నాను. భక్తులను ఆకర్షించడానికి కొన్ని విగ్రహాల్లో బహుమతులు పెట్టే ఆలోచన ఉంది. ఒకే ప్రాంగణంలో 10 వేల విగ్రహాలకు పూజలు గిన్నిస్‌బుక్ రికార్డు. వచ్చే ఏడాది దరఖాస్తు చేస్తాను. – మర్రాపు జగదీష్,
ప్రముఖ యూ ట్యూబర్, కై కలూరు


