సుందరగిరిపై దివ్య పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

సుందరగిరిపై దివ్య పవిత్రోత్సవాలు

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

సుందరగిరిపై దివ్య పవిత్రోత్సవాలు ఆస్పత్రికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు చికిత్స పొందుతూ వర్జీనియా రైతు మృతి

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్‌ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలు స్వామివారి కీర్తిని, వైభవాన్ని మరింతగా చాటనున్నాయి. ఆలయ యాగశాలలో వేద పండితులు, అర్చకులు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌ వరుణ, అఖండ దీపస్థాపన, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, పంచగవ్య ప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠాపన, వాస్తు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అంకురార్పణ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. విహిత దేవత మండప ఆరాధనలు, పవిత్రాభిమన్త్రణ, మూల మంత్ర హోమాలు, అధివాసములు, నీరాజన మంత్రపుష్పములు, బలిహరణలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని, పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కారు ఢీకొని బాలుడి దుర్మరణం.. తండ్రికి గాయాలు

ఆకివీడు: ఏలూరు జిల్లా కై కలూరు శివారు వడ్డిగూడెంకు చెందిన కొల్లేపర పవన్‌కుమార్‌, ఆయన రెండవ కుమారుడు జ్ఞానేశ్వర్‌ (5) జ్వరంతో బాధపడుతుండగా సోమవారం ద్విచక్ర వాహనంపై ఆకివీడు వచ్చి, స్థానిక పిల్లల ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా, జాతీయ రహదారిపై దుంపగడప గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై నుంచి తండ్రీకొడుకులు రోడ్డుపై పడిపోయారు. బాలుడు జ్ఞానేశ్వర్‌కు తలపై తీవ్ర గాయమవ్వడంతో వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన తండ్రి పవన్‌కుమార్‌ స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు చేతి మోచేయి భాగం వెనుకవైపు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీలోని మార్చురీకి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సై శుభశేఖర్‌, సీఐ కాళీచరణ్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లడిల్లుతున్న అమ్మ, అన్న

జ్వరంతో బాధపడుతున్న జ్ఞానేశ్వర్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని వస్తానని చెప్పి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి, అన్న కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో తెలివిగా, చలాకీగా తిరిగే తన కుమారుడు విగతజీవుడిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది.

కొయ్యలగూడెం: దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన వర్జీనియా పొగాకు రైతు ఎర్రిబోయిన శ్రీనివాసరావు (40) అప్పుల బాధతో పురుగుమందు తాగి, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మాజీ సర్పంచ్‌ గొడ్డటి రాణి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు 17 ఎకరాల్లో కౌలు సాగు కోసం రూ. 50 లక్షల వరకు అప్పులు (బ్యాంకు రుణం రూ. 20 లక్షలతో కలిపి) పెట్టుబడి పెట్టాడు. అయితే, ధరలు పడిపోవడంతో 30 క్వింటాళ్ల పొగాకు అమ్మగా కేవలం రూ. 10 లక్షలే వచ్చాయి. పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక, ధరలు మళ్లీ పుంజుకుంటాయన్న ఆశ నిరాశ కావడంతో మనస్తాపం చెంది ఈ నెల 5న ఆయన పొలంలో పురుగుమందు తాగాడు. రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement