ఆగిరిపల్లి: మండలంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఎండిపోయి రైతులు ఉసురుమంటుంటే, మరోపక్క అక్రమార్కులు మాత్రం చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వి జేబులు నింపుకుంటున్నారు. మండలంలోని కలటూరులో గత మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామంలోని శోభనాద్రి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు జేసీబీలతో చెరువు మట్టిని తవ్వి, సుమారు 50 ట్రాక్టర్లతో వెంచర్లకు వందలాది ట్రిప్పులుగా తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ మండల నాయకుడి కనుసన్నల్లోనే ఈ తతంగం యథేచ్ఛగా సాగుతోందని, లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కవడంతో, చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుతున్న విషయం తెలిసినా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. చెరువును ఇష్టానుసారంగా తోడేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయని, దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి, శోభనాద్రి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


