ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు ఎంతగానో కనువిందు చేసింది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను వైభవంగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులు సమర్పించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.


