నూజివీడు డివిజన్‌లో
గత 11 నెలల కాలంలోని వివరాలు
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 17
డివిజన్‌లో గర్భధారణలు : 11,496
టీనేజీ గర్భిణులు : 1158 మంది.
టీనేజీ గర్భిణుల శాతం : 10
నూజివీడు: అభం శుభం తెలియని పసిమొగ్గలు పురిటి నొప్పులు పడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో, ఎదిగీ ఎదగని చిరుప్రాయంలోనే తల్లులవుతున్నారు. తల్లిదండ్రులలో అవగాహన లోపం, పేదరికం, సామాజిక దురాగతాలు, అఘాయిత్యాల మాటున బలవుతున్నారు. వీరిని రక్షించాల్సిన వ్యవస్థ, దారి చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తుండటంతో వందలాది మంది బాలికల బంగారు బాల్యం బుగ్గిపాలవుతుండటమే కాకుండా, వారి భవిష్యత్ నాశనమవుతుండటం ఆవేదన కలిగిస్తోంది. 19 ఏళ్ల లోపే బాలికలు చిన్నారి తల్లులుగా మారుతున్నారు. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రతి 100 మంది గర్భిణీల్లో 10 మంది టీనేజీ గర్భిణీలు ఉండటం గమనార్హం. దీనికంతటికి బాల్య వివాహాలు జరుగుతున్నా వాటిని ఆపలేకపోవడమే కారణం.
ఆగని బాల్య వివాహాలు
టీనేజీ గర్భధారణలకు బాల్య వివాహాలు ప్రధాన కారణం కాగా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, రాజకీయ నాయకుల అండదండలు ఉండటం, మంచి సంబంధమని భావించడం, సామాజిక దురాచారాలు, కుటుంబ ఒత్తిళ్లు, దగ్గరి సంబంధాలు, మేనరికాలు, ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండటం, ఆడపిల్లలను నేటికీ భారంగా పరిగణించడం, వివాహం చేసి బాధ్యత వదిలించుకోవడం వంటివి కనిపిస్తున్నాయి. అలాగే లైంగిక విద్యపై అవగాహన లేకపోవడం, పేదరికం, బడి మానేయడం, ఆర్థిక సమస్యలు, కుటుంబీకుల ఆరోగ్య సమస్యలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో పక్కదారి పట్టడం, తాత్కాలిక ఆకర్షణలకు గురికావడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహిస్తున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా పోలీసు తదితర ఇన్ని విభాగాల సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉండటాన్ని బట్టే వీరి పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. మరోవైపు టీనేజీ గర్భిణీల వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లో మైనర్ల వివరాలను నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో, పేదవర్గాలకు చెందిన టీనేజీ గర్భిణీలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందడం లేదు.
బాల్య వివాహాల నివారణలో వైఫల్యం
బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక వాహన ప్రచారంతో సహా వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్‌లు వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించేవారు.. ఇలా ప్రతి విభాగంలోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా బాల్య వివాహాలు ఆగడం లేదు.
కమిటీలున్నా.. ఫలితం శూన్యం
బాల్య వివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం జిల్లా, డివిజన్, ఐసీడీఎస్ సీడీపీఓ, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం శూన్యమే. బాల్య వివాహాల నియంత్రణలో ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నాయనేది ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. ఇవి కనుక సక్రమంగా పనిచేస్తే చిన్నారులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ
టీనేజీ గర్భిణీల సంఖ్య ఆగిరిపల్లి, సగ్గూరు, చాట్రాయి, చనుబండ, లింగపాలెం, ధర్మాజిగూడెం, యర్రగుంటపల్లి, గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆగని బాల్య వివాహాలు
ప్రతి 100 మంది గర్భిణుల్లో 10 మంది టీనేజీ అమ్మాయిలే
బుగ్గిపాలవుతున్న బాలికల బంగారు బాల్యం


