రాట్నాలమ్మ తల్లికి రూ.1,14 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మ తల్లికి రూ.1,14 లక్షల ఆదాయం

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

రాట్నాలమ్మ తల్లికి రూ.1,14 లక్షల ఆదాయం పోటెత్తిన భక్తులు గజ్జెల పూజా మహోత్సవం ఐదుగురిపై కేసు నమోదు అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు, కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి వివిధ రూపాల ద్వారా రూ.1,14,808 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సతీష్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ తెలిపారు.

కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాల విక్రయం, గదుల అద్దెలు, ఫొటోల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.48,081 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు.

పెనుగొండ: వాసవీ శాంతిధామంలో ఆదివారం గజ్జెల మహోత్సం కనులపండువగా నిర్వహించారు. కూచిపూడి నృత్యం నేర్చుకున్న చిన్నారులు తమ మొదటి ప్రదర్శనను ఇక్కడ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. 102 అడుగుల రుషీగోత్ర మందిరంలో, 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహం, మరకతశిల వాసవీమాత సన్నిధిలో నృత్యకారిణులు గజ్జెల పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వారు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

టి.నరసాపురం: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్తతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల జ్యోత్స్నకు, కొండూరు మండలం నందిగామకు చెందిన పలగాని నవీన్‌కుమార్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం బాగానే చూసుకున్న నవీన్‌కుమార్‌.. ఆ తర్వాత మద్యం, అక్రమ సంబంధాలకు అలవాటుపడ్డాడు. భార్య జ్యోత్స్నను అదనపు కట్నం తేవాలని డిమాండ్‌ చేస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కొట్టసాగాడు. గతేడాది నవంబర్‌ 12న ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అప్పటి నుంచి పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించినా వారు తిరిగి కాపురానికి తీసుకెళ్లకపోవడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జ్యోత్స్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముదినేపల్లి రూరల్‌: అప్పులపాలై మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకరవాడలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పామర్తి వీరలక్ష్మి (35) శ్రీహరిపురంలోని కిరాణా దుకాణంలో పనిచేస్తోంది. ఆమె భర్త కోటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. భర్త వైద్యం కోసం, ఇద్దరు కుమార్తెల చదువుకోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం దుకాణంలోనే ఎలుకల మందు తిని, వాంతులు చేసుకుంటూ ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుడివాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరలక్ష్మి శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె సోదరుడు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement